Kanna: జగన్ సవాల్‌‌పై కన్నా లక్ష్మీనారాయణ రియాక్షన్ ఇదే...

ABN , First Publish Date - 2023-03-01T11:23:34+05:30 IST

175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సవాల్‌పై...

Kanna: జగన్ సవాల్‌‌పై కన్నా లక్ష్మీనారాయణ రియాక్షన్ ఇదే...

పల్నాడు: 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు (Chandrababu), ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) చేసిన సవాల్‌పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (TDP Leader Kanna Laxminarayana) స్పందించారు. పోలీసులతో పాలన చేయడమా జగన్ రెడ్డి దమ్ము.. ప్రతిపక్షాల నోరు నొక్కడమేనా జగన్ దమ్ము అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడమా జగన్ రెడ్డి ధైర్యమని అడిగారు. టీడీపీ (TDP) ఏదైనా కార్యక్రమం చేస్తే రాత్రికి వాళ్ల ఆస్తులు తగలబెట్టడమా ధైర్యం అంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలలో డబ్బు, మద్యం పంచకుండా రావాలని సవాల్ విసిరారు. ‘‘నీ నవరత్నాలపై నీకు నమ్మకం ఉంటే సక్రమ పద్దతిలో ఎన్నికలకు రా. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకో. కులం, మతం చూడకుండా పాలన చేశానని ప్రజలను ఓట్లు అడిగే దమ్ము ఉందా. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే విమర్శలు, సవాళ్లు’’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు జగన్ ఏమన్నారంటే...

వచ్చే ఎన్నికల్లో తాము ఒంటిరిగా పోటీ చేస్తామని.. ఇతర పార్టీలు కూడా ఒంటిరిగా పోటీచేయాల్సిందే అన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి (AP CM) వింత డిమాండ్‌‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ, జనసేన (Janasena)పై సీఎం జగన్ (YCP
Chief) సవాళ్లు విసిరారు. ‘‘దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులపై నేను ఆధారపడ్డాను. అందుకే భయం లేకుండా 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెబుతున్నా. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా? వాళ్లకు ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలకు వాళ్లు మంచి చేసిన దాఖలాలే లేవు. ప్రజలకు మేలు చేశానన్న నమ్మకం, ధైర్యం ఉంది కాబట్టే అన్నీ స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో దుష్టచతుష్టయం చేసే కుట్రలు, అన్యాయాలు ఇంకా పెరుగుతాయని, ప్రజలు అన్నీ గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని జగన్‌ అన్నారు. మంచి జరిగిందా లేదా అన్నదే ప్రామాణికంగా తీసుకోవాలని, మంచి జరిగితేనే తనకు అండగా నిలవాలని కోరారు.

‘‘రాష్ట్రంలో యుద్ధం జరుగుతున్నది కులాల మధ్యన కాదు. ఇది క్లాస్‌ వార్‌. ఒకపక్క పేదవాళ్లు, మరోవైపు పెత్తందార్లు. పొరపాటు జరిగితే రాజకీయాల్లో మాట ఇవ్వడం, దానిని నిలబెట్టుకోవడం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. అంతేకాకుండా పేదలు అనేవాళ్లు లేకుండా మటుమాయం అవుతారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయతకు అర్థం తెలియాలి. ఒక మాట చెప్పి అది నిలబెట్టుకోకపోతే రాజకీయాలకు ఆ వ్యక్తి అనర్హుడనే పరిస్థితి రావాలి. మూడు సంవత్సరాల ఎనిమిది నెలల వైసీపీ పాలనలో పెట్టుబడిసాయం, వడ్డీ లేని రుణాలు, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యుత్‌ రూపంలో ఒక్క రైతులపైనే రూ.లక్షా 45 వేల కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మాది రైతు ప్రభుత్వం. రైతులకు మంచిచేయని చంద్రబాబు ఒకవైపు, మంచి చేసిన మేం ఒక వైపు ఉన్నాం. పేదలకు రూ.లక్ష 93 వేల కోట్ల నగదును నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేసే(డీబీటీ) సిద్ధాంతం మాది. గజదొంగల ముఠాకు చంద్రబాబు బాస్‌. ఆ రోజున కూడా ఇదే బడ్జెట్‌ ఉంది. అప్పుడు ప్రజలకు జరగని మంచి ఇప్పుడెందుకు జరుగుతుందో ఆలోచన చేయాలి?’’ అని జగన్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-01T11:28:33+05:30 IST