MLA Anagani: కాపు నేస్తం అంటూ.. కొత్త మోసానికి తెర..
ABN , First Publish Date - 2023-06-25T12:57:39+05:30 IST
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ళ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాలుగేళ్ళ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ (Anagani Satya Prasad) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కాపు రిజర్వేషన్లు (Kapu Reservations) తీసుకొస్తే.. జగన్ రెడ్డి (Jagan Reddy) రద్దు చేసి వారి గొంతు కోశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాపు కార్పొరేషన్ (Kapu Corporation) ద్వారా కాపు యువతకు అందాల్సిన రూ. 45వేల రుణాలను రద్దు చేశారని ఆరోపించారు. కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు కాపు నేస్తం అంటూ కొత్త మోసానికి తెరలేపారని దుయ్యబట్టారు.
కాపులకు రూ. 2 వేల కోట్లుతో బడ్జెట్ అంటూ.. ఆర్భాటంగా ప్రకటించుకుని.. సొమ్ము మొత్తాన్ని సీఎం జగన్ మళ్లించారని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు. రైతుల్ని విభజించి కాపులకు రైతు భరోసా అందకుండా చేశారన్నారు. కాపులకు జరిగిన అన్యాయంపై కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో వైసీపీ నేతల నోళ్లకు తాళాలు వేసుకున్నారా? అని నిలదీశారు. టీడీపీ హయాంలో ప్రతి జిల్లాలో రూ.5 కోట్ల వ్యయంతో కాపు భవనాలు నిర్మాణం చేస్తే జగన్ రెడ్డి వాటిని నిలిపేశారన్నారు. ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని కాపు సోదరులు గ్రహించి వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ పిలుపిచ్చారు.