Palnadu Dist.: అమరావతిలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్
ABN , First Publish Date - 2023-04-09T10:56:12+05:30 IST
పల్నాడు జిల్లా: అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇసుక అక్రమత్రవ్వకాలపై వైసీపీ-టీడీపీ (YCP-TDP) నేతల మధ్య సవాళ్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.
పల్నాడు జిల్లా: అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇసుక అక్రమత్రవ్వకాలపై వైసీపీ-టీడీపీ (YCP-TDP) నేతల మధ్య సవాళ్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అమరలింగేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీధర్‌తోపాటు కొంతమంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పక్షాలు అవినీతిపై చర్చించి అమరేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమవుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవాళ రాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్సీ ఆదినారాయణ తెలిపారు. ప్రజాస్వామ్యంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు సహజమని అవి పౌర జీవనానికి విఘాతం కలిగేలా శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు చర్చలకు లేదా ప్రమాణానికి రావద్దని డీఎస్సీ విజ్ఞప్తి చేశారు. 200 మంది పోలీసుల బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అమరావతిలోని లాడ్జీల్లో కొత్త వ్యక్తులకు గదులు ఇవ్వొద్దని నిర్వాహకులకు డీఎస్సీ ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అమరావతికి వెళ్లకుండా టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం చేస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్లవద్ద పహరాకాస్తున్నారు. నోటీసులు ఇచ్చి ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. శ్రీధర్, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలకు పోలీసులు శనివారం నోటీసులు అందజేశారు. పోలీసులు ఆంక్షలు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నాయకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహరా కాయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.