Share News

Chandrababu Arrest: సీఐడీ అధికారుల కాల్‌ డేటా రికార్డుపై ఏసీబీ కోర్టులో తీర్పు రిజర్వ్

ABN , First Publish Date - 2023-10-27T13:52:48+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు ఈనెల 31కి రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ దాఖలు చేయగా.. నిన్న సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.

Chandrababu Arrest: సీఐడీ అధికారుల కాల్‌ డేటా రికార్డుపై ఏసీబీ కోర్టులో తీర్పు రిజర్వ్

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని(TDP Chief Chandrababu Naidu) అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల (CID Officials) కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు (ACB Court) ఈనెల 31కి రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ దాఖలు చేయగా.. నిన్న సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువర్గాల‌ న్యాయవాదులు దాఖలు చేసిన సీఐడీ కాల్ డేటా రికార్డ్‌పై ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.


చంద్రబాబు తరపున న్యాయవాదుల వాదనలు ఇవే..

చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకమన్నారు. చంద్రబాబును విచారణ చేసిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుందని తెలిపారు. దర్యాప్తు అధికారికి తెలియకుండా పోటోలు, వీడియోలు బయటకి రావని.. తమ పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదన్నారు. ఈ కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారుల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని... వారి అరెస్టు అక్రమమని తెలిపారు.


ప్రభుత్వ న్యాయవాది వాదనలు...

చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్‌లు , వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకీ లేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటీషన్‌లు వేస్తున్నారని కోర్టుకు చెప్పారు. చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేసినట్లు చెప్పారన్నారు. సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్‌ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిందని.. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా సమర్ధించిందని తెలిపారు. ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్ధమన్నారు. దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అందువల్ల కాల్ డాటా రికార్డు పిటీషన్‌ను కొట్టివేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును ఈనెల 31కి రిజర్వ్ చేసింది.

Updated Date - 2023-10-27T13:52:48+05:30 IST