Share News

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీం కోర్టుకు సీఐడీ

ABN , First Publish Date - 2023-11-21T07:13:57+05:30 IST

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పుపై సీఐడీ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీం కోర్టుకు సీఐడీ

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu)కు హైకోర్టు (High Court) రెగ్యులర్‌ బెయిల్‌ (Regular Bail) మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పుపై సీఐడీ (CID) సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల 29 నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో దుర్వినియోగమైనట్లు చెబుతున్న సొమ్మును టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టు తేల్చిచెప్పింది. అందుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలనూ ప్రాసిక్యూషన్‌ కోర్టుకు సమర్పించలేకపోయిందని పేర్కొంది. చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని కోరడానికి ముందే.. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను సీఐడీ చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వచ్చాయనే నిర్ణయానికి వచ్చేందుకు ఆధారాలేమిటో సీఐడీ చూపించకపోవడం దర్యాప్తులో లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. కేసులో ఇతర నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలో గత నెల 31న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంత బెయిల్‌ ఉత్తర్వులను పూర్తి స్థాయి బెయిల్‌ ఉత్తర్వులుగా ఖరారు చేసింది. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌ను పరిష్కరిస్తున్న ఈ సమయంలో.. రాజకీయ ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పాల్గొనవద్దని మధ్యంతర బెయిల్‌ మంజూరు సందర్భంగా విధించిన షరతులు.. చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతాయని.. అందుచేత వాటిని ఈ నెల 29 నుంచి సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన వైద్యం చేయించుకున్న ఆస్పత్రి, పొందిన చికిత్స వివరాలను, మెడికల్‌ రికార్డులను ఈ నెల 28లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు సోమవారం తీర్పు వెలువరించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేయడం.. అనారోగ్యం కారణంగా కోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై తుది విచారణ జరిపింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌.. సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవల తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెల్లడించారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న చంద్రబాబు విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదం లేదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రస్తావన ఉత్పన్నమే కాదని స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-21T07:41:54+05:30 IST