Jada Shravan Kumar: జగన్ పాలన చూస్తుంటే సిగ్గుగా ఉంది..
ABN , First Publish Date - 2023-05-24T17:07:57+05:30 IST
జగన్ ముఖ్యమంత్రి కాకముందు అవినీతికి తావులేకుండా, ప్రాథమిక హక్కులకు భంగం లేకుండా పరిపాలన అందిస్తానని చెప్పిన మాటలు ఇప్పటికి ప్రతిభింబిస్తున్నాయని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు.
విజయవాడ: జగన్ (Jagan) ముఖ్యమంత్రి కాకముందు అవినీతికి తావులేకుండా, ప్రాథమిక హక్కులకు భంగం లేకుండా పరిపాలన అందిస్తానని చెప్పిన మాటలు ఇప్పటికి ప్రతిభింబిస్తున్నాయని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ (Jada Shravan Kumar) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ (Ambedkar) ఆశయాలకు తూట్లు పొడుస్తూ.. పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలన చూస్తుంటే సిగ్గుగా ఉందన్నారు. వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
అమరావతి రైతుల (Amaravathi Farmers) న్యాయం కోసం తాను అమరావతిలో దీక్షకు పూనుకుంటే పోలీసులతో భగ్నం చేస్తారా? అంటూ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్థలంలో 5 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులతో ఎప్పుడైతే తన దీక్షను అడ్డుకున్నారో అపుడే ఈ ప్రభుత్వం పిరికిపందగా మారిందన్నారు. తనను ఎక్కడైతే అడుగుపెట్టనివ్వమని విర్రవీగారో వారికిది చెంపపెట్టు అని, షంషేర్‌గా అక్కడ అడుగుపెట్టానని, భవిష్యత్‌లో ఇదే విధంగా అమరావతి రైతుల తరపున పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ రోజు తన దీక్షకు మద్దతుగా తుళ్లూరు శిబిరం వద్దకు తరలివచ్చిన మహిళా తల్లులకు, రైతులకు శ్రావణ్ కుమార్ వందనాలు తెలిపారు.