Kambhampati: బచ్చుల అర్జునుడు మృతికి కంభంపాటి రామ్మోహన్ సంతాపం

ABN , First Publish Date - 2023-03-03T09:23:10+05:30 IST

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిపట్ల మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు సంతాపం తెలిపారు.

Kambhampati: బచ్చుల అర్జునుడు మృతికి కంభంపాటి రామ్మోహన్ సంతాపం

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (TDP MLC Bachula Arjuludu) మృతిపట్ల మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు (Kambhampati Rammohanrao) సంతాపం తెలిపారు. బచ్చుల అర్జునుడు మృతి విచారకరమన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌గా, కృష్ణా జిల్లాపార్టీ అధ్యక్షుడిగా, శాసనమండలి సభ్యుడిగా, పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌గా అర్జునుడు సేవలు ప్రశంసనీయమన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. అర్జునుడు మృతితో తెలుగుదేశం (TDP)పార్టీ ఒక క్రమశిక్షణ గల సైనికుడిని కోల్పోయిందని ఆవేదన చెందారు. ఆయన మృతి కృష్ణాజిల్లాకే కాదు, తెలుగుదేశం పార్టీకి తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ... అర్జునుడు కుటుంబ సభ్యులకు కంభంపాటి రామ్మోహన్ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

అంతిమయాత్రలో చంద్రబాబు

టీడీపీ నేత బచ్చుల అర్జునుడు అంతిమయాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పాల్గొననున్నారు. ఈరోజు చంద్రబాబు మచిలీపట్నం (Machilipatnam) రానున్నారు. అంతిమయాత్రలో చంద్రబాబు పాల్గొననున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర (Kollu ravindra) తెలియజేశారు. ఈరోజు ఉదయం 11గంటలకు మల్కాపట్నంలోని అర్జునుడు స్వగ్రామం నుండి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని రవీంద్ర తెలిపారు. బుట్టాయిపేట సెంటర్, కోనేరుసెంటర్, తోటవారితుళ్ల సెంటర్, రైల్వే స్టేషన్ మీదుగా బందరుకోటకు అంతిమయాత్ర చేరుకుంటుందన్నారు. బందరుకోటలో అర్జునుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు రవీంద్ర తెలిపారు.

కాగా... జనవరి 28న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బచ్చుల అర్జునుడు చికిత్స పొందుతూ నిన్న (గురువారం) తుదిశ్వాస విడిచారు. అర్జునుడు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఈరోజు అర్జునుడు అంత్యక్రియలు జరుగనున్నాయి.

Updated Date - 2023-03-03T09:23:10+05:30 IST