Nimmala Ramanaidu: జగన్ దోపిడీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
ABN , First Publish Date - 2023-09-25T13:54:45+05:30 IST
2004లో ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ కుటుంబం, తండ్రి వైఎస్ అధికారంలోకి రాగానే రూ.3.30 లక్షల కోట్లకు అమాంతం ఎలా ఎగబాకారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ప్రజా సంపద లూటీతోనే. జగన్ ఆస్తులు పెరిగాయన్నారు.
అమరావతి: సీఎం జగన్ (CM Jagan)పై ఉన్న కేసులు (Cases), పిటీషన్లు (Petitions), స్టేల (Stay)పై టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) సోమవారం అమరావతి, టీడీపీ కేంద్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (Power Point Presentation) ఇచ్చారు. సీఎం జగన్ ఆర్ధిక ఉగ్రవాదని, ధనపిశాచి అని వ్యాఖ్యానించారు. 2004లో ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ కుటుంబం, తండ్రి వైఎస్ (YS) అధికారంలోకి రాగానే రూ.3.30 లక్షల కోట్లకు అమాంతం ఎలా ఎగబాకారని ప్రశ్నించారు. ప్రజా సంపద లూటీతోనే. జగన్ ఆస్తులు పెరిగాయన్నారు.
2023లో రూ.3,30,500 కోట్లకు ఎలా ఎగబాకారు?
2023లో రూ.3,30,500 కోట్లకు ఎలా ఎగబాకారు?.. రూ. 8లక్షల పెట్టుబడితో 2006లో జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ప్రారంభించి రూ.10 షేర్‌ను రూ.360కు అమ్మారని నిమ్మల రామానాయుడు అన్నారు. సెజ్‌లు, గనులు, భూములు, కాంట్రాక్టులు కేటాయించి ప్రతిఫలంగా జగతి పబ్లికేషన్‌లోకి పెట్టుబడులు పెట్టించారని అన్నారు. 2006లో ప్రారంభమైన భారతీ సిమెంట్‌లో పైసా పెట్టుబడి లేకుండా ఛైర్మన్, ఎండీగా జగన్ రెడ్డి ఎంపికయ్యారని, ఓబులాపురంలో గాలి జనార్ధనరెడ్డితో కలిసి జగన్ భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపులకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరాక జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందూ సంస్థ రూ.70 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ రెడ్డి, భారతి రెడ్డి, విజయలక్ష్మి డైరెక్టర్లుగా ఉన్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో రైతులను బెదిరించి కారు చౌకగా 15 వందల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.
2019లో జగన్ రెడ్డి కుటుంబo ల్యాండ్, లిక్కర్, మైన్, పోర్టులు ఇతరత్రా కుంభకోణాల ద్వారా రూ. 2,55,500 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నిమ్మల రామానాయుడు అన్నారు. ఇసుక ద్వారా 4 ఏళ్లలో రూ. 40 వేల కోట్లు దోచేశారని, మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్‌కు అనుమతివ్వకుండా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన రూ.41 వేల కోట్ల ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు మళ్లించారని, మద్యం రేట్లు పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లుగా మరో రూ.13,500 కోట్లు కొట్టేశారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక కోసం రూ.300 కోట్లు, ప్రభుత్వ ప్రకటనల ద్వారా రూ.500 కోట్లు దోచిపెట్టారన్నారు. విశాఖలో భూకబ్జాలు రూ.40 వేల కోట్లు... సెంటు పట్టాలో అవినీతి రూ.7 వేల కోట్లు దోచుకున్నారని నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో వెల్లడించారు.