Anuradha: ఆ మంత్రికి పోలవరంకు ఎన్ని గేట్లుంటాయో తెలుసా?..

ABN , First Publish Date - 2023-05-30T15:19:25+05:30 IST

టీడీపీ ప్రకటించిన మానిఫెస్టోతో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్‌పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.

Anuradha: ఆ మంత్రికి పోలవరంకు ఎన్ని గేట్లుంటాయో తెలుసా?..

అమరావతి: మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన మానిఫెస్టో (Manifesto)తో వైసీపీ నేతలు (YCP Leaders) గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్‌ (Lokesh)పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) అన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మానిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిదని, దానిని ప్రజలు ఏనాడో చించేశారన్నారు. అంబటి రాంబాబు (Ambati Rambabu) మంత్రిగా ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. పోలవరం డీపీఆర్ ఆమోదించటం చేతకాదని, నిర్వాసితులకు ఇళ్లు కట్టలేదని, పరిహారం ఇచ్చే దమ్ము లేదు.. కానీ సిగ్గులేకుండా చంద్రబాబు గురించి మాట్లాడుతారా? అంటూ దుయ్యబట్టారు. మృతుల కుటుంబాల దగ్గర వాటాలు అడిగిన నీచచరిత్ర అంబటిదని, మంత్రిగా ఏనాడైనా ఏ ప్రాజెక్టు దగ్గరకైనా వెళ్లి సమీక్ష చేశారా? అని నిలదీశారు. పోలవరంకు ఎన్ని గేట్లుంటాయో తెలుసా? సుజల స్రవంతి అడ్రస్ ఎక్కడుందో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు.

దేవుడి మాన్యాలు కాపాడలేని దద్దమ్మ కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana).. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? అని అనురాధ ప్రశ్నించారు. అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రన్న కేటాయించిన భూమిని కుదించారని.. అలాంటి వ్యక్తి నీతులు చెప్పేదేంటని మండిపడ్డారు. పేదల్ని ధనవంతుల్ని చేస్తామంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు పంచకుండా మంత్రి జోగి రమేష్ పాడుపెట్టారని విమర్శించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నోరెత్తలేని జోగి రమేష్ టీడీపీ మానిఫెస్టో గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

మంత్రి కాకాణి (Kakani)కి కోర్టులో పైళ్లు దొంగతనం చేయటంపై ఉన్న అవగాహన అగ్రకల్చర్ మీద లేదని పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. రైతుల నుంచి ఎంత ధాన్యం కొన్నారో? రైతులకు ఏం ఒరగబెట్టారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ముందు కుర్చీలో కూర్చోలేని డిప్యూటి సీఎం నారాయణ కూడా చంద్రబాబుపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మేరుగ నాగార్జునకు వేమూరులో డిపాజిట్లు కూడా రావన్నారు. అందుకే ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రన్నపై ఇప్పటి నుంచే ఆరోపణలు చేస్తున్నారని పంచుమర్తి అనురాధ విమర్శించారు.

Updated Date - 2023-05-30T15:19:25+05:30 IST