Raghurama: 24గంటల్లో ఇవ్వన్నీ జరగడం శుభసూచకం...
ABN , First Publish Date - 2023-04-26T16:58:42+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబును నిన్న రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూ చేసిందని, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు న్యాయం జరిగేలా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను నిన్న రిపబ్లిక్ టీవీ (Republic TV) ఇంటర్వ్యూ (Interview) చేసిందని, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజలకు న్యాయం జరిగేలా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా బీజేపీ (BJP) కూడా ఏపీ ప్రభుత్వం వైఖరి చూసి ఇలాంటి పాలకుడిని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుందని, 24గంటల్లో ఇవ్వన్నీ జరగడం శుభసూచకమని అన్నారు. ఒక రాక్షసుడిని అంతమొందించాలంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎం జగన్ (CM Jagan) అన్ని అబ్దాలు చెబుతారని, పథకాలన్నీ పాతవేనని, ఒక్క బిల్డింగ్‌కు కూడా పునాది వేయలేదని రఘురామ విమర్శించారు.
మూడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం నిర్మాణం చేసిందని రఘురామ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 28 స్కీమ్‌లను తీసేసిందని, ఒక రాక్షసుడికి ప్రజలు వరం ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌కు వైఎస్సార్ అని పెట్టుకున్నారని.. దానికి జగన్ పేరు పెట్టుకోవాల్సిందన్నారు. ప్రజలు బ్రతకాలంటే.. అందరూ కలిసి పొత్తుగా ముందుకు వెళ్లాలని సూచించారు.
జగన్ సభ నుంచి జనాలు పారిపోతున్నారని.. దీంతో సీఎం కన్ఫ్యూజన్‌లో ఉన్నారని రఘురామ అన్నారు. వివేకా కేసు ఎప్పుడు తేలుతుందో తెలియదని, ఎంపీ అవినాష్ రెడ్డి రేపో, ఎల్లుండో అరెస్టు అయ్యే అవకాశం ఉందన్నారు. ఏం మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రికి తెలియడం లేదని.. సంకేతాలు చూస్తుంటే రాష్టానికి మంచి రోజులు వస్తున్నాయని అర్థమవుతోందన్నారు. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ట్వీట్ చేస్తున్నారని, మళ్ళీ కేంద్రంలో వచ్చేది బీజేపీ.. మోదీ ప్రభుత్వమేనని.. పసుపు, ఎరుపును కలిపితే వచ్చేది కాషాయమేనని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.