Share News

AP News: మంత్రుల కంప్లంట్‌తో జడ్పీ చైర్‌పర్సన్‌ భర్తపై సజ్జల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-10-19T23:46:36+05:30 IST

జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారులో మద్యం రవాణా అవుతున్న విషయాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. దీనికితోడు జడ్పీ అక్రమాల్లోనూ భాగం ఉందని

AP News: మంత్రుల కంప్లంట్‌తో జడ్పీ చైర్‌పర్సన్‌ భర్తపై సజ్జల ఆగ్రహం

  • మద్యం, జడ్పీ అక్రమాలపై చీవాట్లు

  • సొంత కారులో వచ్చి తనను కలవాలని పిలుపు

  • ఆలయ్యంగా వెళ్లడంతో రామకృష్ణారెడ్డి

  • సమాచారం లీక్‌ చేసింది ఉద్యోగులేనని అక్కసుతో రగిలిపోతున్న రాము

జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారులో మద్యం రవాణా అవుతున్న విషయాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. దీనికితోడు జడ్పీ అక్రమాల్లోనూ భాగం ఉందని ఇంటెలిజెన్స్‌ ద్వారా నివేదికలు తెప్పించింది. రాము వ్యవహార శైలిపై తాడోపేడో తేల్చే బాఽధ్యత తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం ఉన్నట్టు తెలిసింది. ఫోన్‌లోనే రాముకు చీవాట్లు పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జడ్పీలో జరుగుతున్న అక్రమ తంతును మాజీ మంత్రి పేర్ని నాని, ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రోజా కూడా అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రామును నియంత్రించే బాధ్యతను అధిష్టానం సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించింది. వెంటనే తనను కలవాలని సజ్జల నుంచి రాముకు ఫోన్‌ వచ్చింది. నీ సొంత కారులోనే రావాలని గట్టిగా కబురు వచ్చినట్టు సమాచారం. సజ్జల రమ్మన్న సమయానికి ఆయన వెళ్లలేకపోయాడు. ఆలస్యంగా వె ళ్లడంతో అప్పటికే సజ్జల బయటకు వెళ్లిపోయారు. తాను వచ్చిన విషయాన్ని సజ్జలకు రాము ఫోన్‌ చేసి చెప్పాడు. ఫోన్‌లోనే రాముకు సజ్జల చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. దీంతో రాము వెనుదిరగాల్సి వచ్చింది.

ఉద్యోగులపై రాము అక్కసు..

తన వ్యవహారాలను జడ్పీలోని ఉద్యోగులే బయటకు లీక్‌ చేస్తున్నారనే ఉద్దేశంతో రాము ఊగిపోతున్నాడు. జడ్పీ డెప్యూటీ సీఈవోపై అనుమానంతో.. ఇటీవలే పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ను కలిసి బదిలీ చేయాల్సిందిగా రాము సతీసమేతంగా వెళ్లి ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అకౌంట్స్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహనం కోల్పోయి ఫోన్‌ను సోఫాలో విసిరికొట్టి అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదే సందర్భంలో తన విషయాలను బయటకు లీక్‌ చేసిన వారి వివరాలు తెలిస్తే నరికేసేవాడినన్న తీవ్ర పదజాలాన్ని కూడా రాము ప్రయోగించినట్టు సమాచారం. ఇంటెలిజెన్స్‌ ద్వారా ఈ వ్యాఖ్యలు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. దీనిపై అధిష్టానం కూడా సీరియస్‌గా ఉంది.

అంతర్మథనంలో అధిష్టానం

ఎన్నికల ముందు ఇలాంటి వ్యవహారాలు కలిగిన వారిపై కఠినంగా లేకపోతే మొదటికే మోసం వస్తుందన్న భావనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. రాము నిర్వాకాల వల్ల రెండు జిల్లాల్లో స్థానికంగా పార్టీపైనా, నాయకులపైనా, కార్యకర్తలపైనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రామును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలా? ఎలాంటి పదవులూ కట్టబెట్టకుండా పక్కన పెట్టేయాలా అనే అంతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ విషయం అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Updated Date - 2023-10-20T11:25:59+05:30 IST