Lokesh Padayatra: కర్ణాటకలో డీజిల్ కొట్టించిన లోకేష్... రేట్ల తేడాపై ప్రజలకు వివరణ
ABN , First Publish Date - 2023-01-30T12:36:40+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం లోకేష్ పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara Lokesh Yuvagalam Padayatra) నాలుగో రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం పంతాన్ హల్లికి పాదయాత్ర చేరుకుంది. లోకేష్ పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పంతాన్ హల్లి హెచ్ పెట్రోల్ బంక్‌లో ఆగిన టీడీపీ నేత... తన కాన్వాయ్ వాహనాలకు దగ్గరుండి డీజిల్ కొట్టించారు. అనంతరం తానే స్వయంగా డబ్బులు ఇచ్చి ఏపీలో ఉన్న రేట్లకి కర్ణాటకలో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకి ఉన్న తేడాను తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై జగన్ రెడ్డి బాదుడే బాదుడు అని లోకేష్ మండిపడ్డారు. కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ.88, పెట్రోల్ రూ.102 అని... ఏపీలో లీటర్ డీజిల్ రూ.99.27, రూ.పెట్రోల్ 111.50లుగా ఉందని... అంటే జగన్ రెడ్డి బాదుడు 10 రూపాయిలు అని చెప్పుకొచ్చారు. తనతో నడుస్తున్న ప్రజలకు, కార్యకర్తలకు రేట్ల తేడా గురించి వివరించారు. దేశం మొత్తంలో ఏపీలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయంటూ పన్నుల భారం గురించి ప్రజలు, కార్యకర్తలకు లోకేష్ వివరించారు.
పలమనేరు నుంచి నాలుగోరోజు పాదయాత్ర మొదలు...
లోకేష్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా లోకేష్‌ను వి.కోటలో పట్టుగూళ్ల రైతులు కలిశారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే.. సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం జీఎమ్మార్ కళ్యాణ మండపంలో యువతతో టీడీపీ నేత భేటీ అవుతారు. ఆపై వి.కోట కూరగాయల మార్కెట్లో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం వి.కోట ఆగా కల్యాణ మండపం ఎదురుగా ముస్లిం మైనారిటీలతో సమావేశమవుతారు. అనంతరం కృష్ణాపురం క్రాస్ వరకు పాదయాత్ర సాగనుంది. రాత్రికి కృష్ణాపురం టోల్గేట్ సమీపంలో లోకేష్ బస చేస్తారు.