YuvaGalam: 70వ రోజుకు లోకేష్ పాదయాత్ర.. 900 కి.మీ మైలురాయిని చేరుకోనున్న యువనేత
ABN , First Publish Date - 2023-04-14T10:43:16+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది.
నంద్యాల: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు డోన్ నియోజకవర్గం గుడిపాడు క్యాంప్ సైట్ నుంచి 70వ రోజు యువగళం పాదయాత్ర (YuvaGalam)ను యువనేత ప్రారంభించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ ఇంఛార్జ్ సుబ్బారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం ప్యాపిలి బీసీ కాలనీలో 900 కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ (Nara Lokesh) చేరుకోనున్నారు. మరోవైపు లోకేష్ (YuvaGalam Lokesh) ను చూసేందుకు అభిమానులు, మహిళలు పెద్దఎత్తున రోడ్డుపైకి వస్తున్నారు. తమ అభిమాన నేతను కలిసి సమస్యలను చెప్పుకుంటారు. టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీర్చుతామంటూ లోకేష్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. నేడు 70వరోజు పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నాయకులు, డోన్ నియోజకవర్గం, పోతుదొడ్డి, మానుదొడ్డి గ్రామాల మామిడి రైతులు కలిసి తాము పడుతున్న బాధలను విన్నవించారు.
సబ్సిడీలు పెంచుతాం...
గొర్రెలు, మేకల అభివృద్ధిపై గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నాయకులు యువనేతకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 1.76 కోట్ల గొర్రెలు, 55.22 లక్షల మేకలు ఉన్నాయని.. గొర్రెలు, మేకల పెంపకానికి అవసరమైన పచ్చిక బయలు భూములు తగ్గిపోయాయన్నారు. ఎన్.సీ.డీ.సీ పథకంలో సబ్సిడీ 20 శాతమే ఉందని.. దాన్ని 75శాతానికి పెంచాలని కోరారు. జీవాలకు షెడ్లు నిర్మించి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు 50 ఏళ్లకే పెన్షన్లు అందించాలి నేతలు కోరారు.
దీనిపై లోకేష్ స్పందిస్తూ... బడుగు, బలహీన, అణగారిన వర్గాలను టీడీపీ ప్రభుత్వం ఆదుకున్నదని తెలిపారు. గతంలో సబ్సిడీపై గొర్రెలు, మేకల యూనిట్లను అందించామన్నారు. ఉచిత ఇన్సూరెన్స్ అందించి జీవాల పెంపకందారుల నష్టాలను తగ్గించామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సబ్సిడీలు పెంచుతామని హామీ ఇచ్చారు. జీవాలకు షెడ్లు నిర్మిస్తాం. 50ఏళ్లకు పెన్షన్లపై మ్యానిఫెస్టోలో స్పష్టతనిస్తామని లోకేష్ వెల్లడించారు.
లోకేష్‌తో బాధలు చెప్పుకున్న మామిడి రైతులు..
పోతుదొడ్డి, మానుడొడ్డి గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లోనూ మామిడి తోటలు అధికంగా ఉన్నాయని ఆ ప్రాంత మామిడి రైతులు తెలిపారు. మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నామన్నారు. అయితే గిట్టుబాటు ధరలు లేని సమయంలో ఇబ్బందులు పడుతున్నామని లోకేష్‌కు తెలిపారు. మామిడికి ధరల్లేనప్పుడు నిల్వ ఉంచుకోవడానికి స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.
లోకేష్ మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మామిడి రైతుల పరిస్థితి అగమ్యఘోచరంగా మారిందని విమర్శించారు. పంట నష్టపోయిన వారిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. టీడీపీ హయాంలో గిట్టుబాటు ధరకు అదనంగా రూ.2లు ఇచ్చి ఆదుకున్నామని గుర్తుచేశారు. వైసీపీ నేతలు సిండికేట్లుగా మారి మామిడి రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరల్లేకపోయినా... వైసీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తానని హామీనిచ్చిన జగన్ మర్చిపోయారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మామిడి బోర్డు, స్టోరోజ్ గోడౌన్ ఏర్పాటుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు.