YuvaGalam Padayatra: 81వ రోజు పాదయాత్రలో లోకేష్ ఎవరెవరిని కలిశారంటే...

ABN , First Publish Date - 2023-04-26T10:40:04+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

YuvaGalam Padayatra: 81వ రోజు పాదయాత్రలో లోకేష్ ఎవరెవరిని కలిశారంటే...

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) యువగళం పాదయాత్రకు (YuvaGalam Padayatra) ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గత 80 రోజులుగా ఎంతో ఉత్సాహంగా లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) చేస్తూ ప్రజల సాదకబాదకాలను వింటున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తీర్చుతామని ప్రజలకు అభయమిస్తున్నారు. ఈరోజు 81వ రోజు పాదయాత్రను మంత్రాలయం నియోజకవర్గం కోసిగి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బోపాయి రైతులను లోకేష్ కలిశారు. కోసిగి శివార్లలో మోహన్, శ్రీరామ్ అనే బొప్పాయి రైతులను యువనేత లోకేష్ కలిసి.. వారి కష్టాలను తెలుసుకున్నారు.

రైతులు మాట్లాడుతూ.. చెరో నాలుగు ఎకరాలు పొట్టి బొప్పాయి వేస్తే, ఒక్కొక్కరికి 8 లక్షలు నష్టం వచ్చిందని తెలిపారు. ఇటీవల ఈదురుగాలులు, అకాల వర్షాలకు చెట్లు దెబ్బతిన్నాయని, కాయలు నేల రాలాయని అన్నారు. అధికారులు వచ్చి పంటను పరిశీలించాలని కోరితే... పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తెండి రాస్తామన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పరిశీలించకుండా నష్టం ఎలా అంచనా వేస్తారని అడిగితే ఇష్టమైతే తాము అడిగిన వివరాలు తెండి, లేకపోతే మానుకోండని ఆర్‌బీకేలో సమాధానమిచ్చారన్నారు. రెండునెలలైనా ఇంతవరకు ఎవరు పంటను పరిశీలించడానికి రాలేదని చెప్పారు. నీళ్లులేకపోతే పులికనుమ నుంచి 10లక్షలు ఖర్చుపెట్టి 4 కిలోమీటర్లు పైపులు వేసి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. గతంలో ఇరుగుపొరుగు వారు బొప్పాయి వేస్తే లాభాలు వచ్చాయని చెబితే తాము ఈ పంట ఎంచుకున్నామని.. ప్రభుత్వం నుంచి సాయం అందకపోతే వ్యవసాయం చేయలేమని రైతులు తమ బాధను చెప్పుకొచ్చారు.

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ... క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. సొంతంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి ఇంత వరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్రిప్, ఇన్ పుట్ సబ్సిడీ, పంటనష్టపోతే సకాలంలో క్రాప్ ఇన్సూరెన్స్ అందజేశామని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా పత్తి రైతుపై సగటు రూ.2.5 లక్షల అప్పుతో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు అండగా నిలుస్తామని, నష్టపోయిన రైతాంగానికి ఆదకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు.

నీటి వనరులున్నా తాగునీరు అందని దుస్థతి...

అనంతరం లోకేష్‌ను డి.బెళగల్ గ్రామస్తులు కలిశారు. మంత్రాలయం నియోజకవర్గం డి.బెళగల్ గ్రామస్తులు యువనేత నారా లోకేష్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. తమ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో పులికనుమ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, బసలదొడ్డి ఎత్తిపోతల ఉన్నాయని తెలిపారు. తమ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఉందని... కానీ తమ గ్రామానికి తాగు, సాగు నీరు అందడం లేదన్నారు. తుంగభద్ర నుంచి ఎత్తిపోతల ద్వారా నీరు అందించాలని కోరారు. డి.బెళగల్ మండలానికి డిగ్రీ కాలేజి ఏర్పాటు చేయాలన్నారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విన్నవించారు. ఉచిత విద్య, వైద్యం, పంటలకు గిట్టుబాటు ధరలు, మంచి విత్తనాలు అందించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ గ్రామ నిధులు రూ.35 లక్షలు లాక్కుందని... వాటిని తిరిగి ఇప్పించాలని కోరారు. నరేగా పథకం పనులకు సంబంధించిన కూలీ సొమ్ము గతంలో సకాలంలో వచ్చేవని... నేడు 3 నెలలైనా రావడం లేదని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ.... వైసీపీ ప్రజాప్రతినిధులకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపంలో నీటి వనరులున్నా తాగునీరు అందని దుస్థితి కల్పించడం బాధాకరమన్నారు. గురురాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టులను చేపల పెంపకం కోసం నీళ్లివ్వకుండా రైతుల నోళ్లుగొట్టడం దారుణమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసి 24/7 తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో మాదిరి సబ్సిడీలు, విత్తనాలు అందించి రైతులను ఆదుకుంటామన్నారు. నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులు, కూలీలకు సౌలభ్యంగా ఉండేలా చేస్తామని యువనేత హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-26T10:40:04+05:30 IST