YuvaGalam Padayatra: మాచాపురంలో రైతులతో లోకేష్ ముఖాముఖి.. వైసీపీ సర్కార్‌పై విసుర్లు

ABN , First Publish Date - 2023-04-28T14:14:27+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.

YuvaGalam Padayatra: మాచాపురంలో రైతులతో లోకేష్ ముఖాముఖి.. వైసీపీ సర్కార్‌పై విసుర్లు

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ యువగళం పాదయాత్ర (Nara Lokesh YuvaGalam Padayatra) కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా మాచాపురంలో రైతులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. నకిలీ విత్తనాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. 12 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట వేస్తే నష్టం వచ్చి భర్త అంజనయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని రంగమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. భూ సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం వేధిస్తుందంటూ లోకేష్ వద్ద రైతు నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమి ప్రభుత్వం లాక్కుందని తెలిపారు. మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని... పండిన పంటకు గిట్టుబాటు ధర లేదని.. అమ్ముకోవడం కోసం యార్డ్ లేక ఇబ్బంది పడుతున్నామని ఎమ్మిగనూరు నియోజకవర్గం రైతులు వాపోయారు.

దీనిపై లోకేష్ మాట్లాడుతూ... జగన్ (AP CM Jaganmohan Reddy) ఒక హాలిడే సీఎం మండిపడ్డారు. టీడీపీ (TDP) హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. జగన్ పాలనలో కనీసం 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పేరుతో రాయలసీమ రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తున్నారని మండిపడ్డారు. ఖచ్చితంగా కరెంట్ బిల్లు కూడా వసూలు చేస్తారన్నారు. ‘‘సంతకాలు చేస్తే మీరు బిల్లు కట్టాల్సిందే .. మీటర్లు పెడితే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా పోరాడుతుంది’’ అని అన్నారు. జగన్ రైతు రాజ్యం తెస్తానని రైతులు లేని రాజ్యం తెచ్చారని విమర్శించారు. వైసీపీ పాలనలో క్యాబినెట్‌లో చంచల్ గూడా జైలుకి నెక్స్ట్ వెళ్ళేది ఎవరూ అనే చర్చ తప్ప రైతులు సమస్యల గురించి ఏనాడూ చర్చించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసే పనిలో బిజీగా ఉన్నారని యెద్దేవా చేశారు.

అది భూ భక్త పథకం...

జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే నంబర్ 3 లో ఉందని.. అలాగే కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్‌లో ఉందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామన్న జగన్ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదని మండిపడ్డారు. దళిత రైతు రంగమ్మ కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుందని.. తక్షణమే లక్ష రూపాయిలు ఆర్ధిక సహాయం పార్టీ నుంచి అందిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.10 లక్షల పరిహారం కూడా అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ ది శాశ్వత భూ హక్కు పథకం కాదు అది భూ భక్ష పథకమన్నారు. సర్వే తరువాత భూమి తగ్గించి పాస్ పుస్తకం ఇస్తున్నారని మంత్రులే మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయన సొంత భూమి మీకు ఇస్తున్నట్టు పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ వేస్తున్నారని మండిపడ్డారు. భూమి తగ్గితే అధికారుల చుట్టూ తిరగాలని ఉచిత సలహా ఇస్తున్నారని అన్నారు.

రైతులను గాలికొదిలేశారు..

రాయలసీమ రైతులకు వరంలా ఉన్న డ్రిప్ ఇరిగేషన్‌ను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ హయాంలో సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందజేసామని తెలిపారు. టీడీపీ హయాంలో రూ.50వేల కంటే తక్కువ ఉన్న రైతు రుణాలు అన్నీ ఒక్క సంతకంతో మాఫీ చేసామని చెప్పారు. టీడీపీ హయాంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సబ్సిడీ ధరకు అందజేశామన్నారు. టీడీపీ హయాంలో భూసార పరీక్షలు, మైక్రో నూట్రియెంట్స్ అందజేసాం. ఏ పంటలు వెయ్యాలో కూడా చెప్పే వాళ్ళమన్నారు. ఇప్పుడు జగన్ పాలనలో రైతులని గాలికి వదిలేశారని విమర్శించారు. జగన్ పాలనలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రేట్లు రెట్టింపు అయ్యాయని... నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నకిలీ విత్తనాలు విచ్చల విడిగా అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న కంపెనీలపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ప్రకృతిపై నెపం నెట్టేస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తనకు తెలుసన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఆదోని లో మిర్చి యార్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?..

జగన్ చెప్పిన రూ.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. 12,500 రైతు భరోసా అన్న జగన్ ఇప్పుడు 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఒక్కో రైతు దగ్గర నుంచి రూ.25 వేలు కొట్టేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో ఆర్బికే సెంటర్లు ఒక బోగస్ అని... వాటి ద్వారా ఒక్క రైతుకి కూడా సాయం అందలేదని తెలిపారు. మిర్చి, టొమాటో, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాయలసీమలో మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి మూడు ఏళ్లలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో రూ.1986 కోట్లతో ప్రారంభించిన ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఎల్‌ఎల్‌సీ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని.. రాయలసీమను హార్టి కల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-28T14:14:27+05:30 IST