YuvaGalam: 89వ రోజుకు యువగళం పాదయాత్ర.. నేడు మహిళలతో లోకేష్ ముఖాముఖి
ABN , First Publish Date - 2023-05-04T09:43:34+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh YuvaGalam) యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాణ్యం నియోజకవర్గంలో యువనేత పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ప్రజలు, సామాజిక వర్గాలు, రైతులు, యువతను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై లోకేష్ విరుచుకుపడుతున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈరోజు ఉదయం రేమడూరు విడిది కేంద్రం నుంచి 89వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. ఈరోజు మధ్యాహ్నం బోల్లవరంలో మహిళలతో ముఖాముఖీ కార్యక్రమంలో యువనేత పాల్గొననున్నారు. ప్రతీరోజు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత చురుగ్గా పాల్గొంటున్నారు. రోజూ వెయ్యి మందిపైగా అభిమానులతో లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. తమ అభిమాన నేత ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. నిన్న కోడుమూరు శివారు విడిది కేంద్రం నుంచి 88వ రోజు పాదయాత్ర మొదలైంది. దారిపొడవునా యువత, మహిళలు, వృద్ధులు లోకేష్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. బుడగ జంగాలు, రాయలసీమ మాదిగ దండోరా నాయకులు, చేనేతలు, కోడుమూరు మండల రైతులు, ప్రజలు వారి సమస్యలపై యువనేతకు వినతిపత్రాలు సమర్పించారు.