YuvaGalam: 96వ రోజు పాదయాత్రను ప్రారంభించిన లోకేష్
ABN , First Publish Date - 2023-05-11T09:08:41+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 96వ రోజుకు చేరుకుంది.
నంద్యాల: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర (Nara lokesh YuvaGalam Padayatra) 96వ రోజుకు చేరుకుంది. ఈరోజు నందికొట్కూరు నియోజవర్గం నుంచి 96వ రోజు పాదయాత్రను యువనేత (NaraLokesh)ప్రారంభించారు. నందికొట్కూరు నుంచి మండ్లెం, తర్తూరు, జూపాడుబంగ్లా, తరిగోపుల క్రాస్, 80 బన్నూరు వరకు పాదయాత్ర సాగనుంది. స్థానికులు, వివిధ సామాజిక వర్గీయులతో నారా లోకేష్(TDP Leader) సమావేశం కానున్నారు. మధ్యాహ్నం తరిగోపుల క్రాస్ వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో నిర్వహించే ముఖాముఖీ సమావేశంలో యువనేత పాల్గొంటారు. రాత్రి 80 బన్నూరు శివారులో బస చేయనున్నారు.
కాగా 95వ రోజు యువనేత పాదయాత్ర విజయవంతంగా సాగింది. నిన్న ఉదయం కోడుమూరు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలవగా కాసేపటికే నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్‌ను టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆపై పలు సామాజిక వర్గీయులు, ముస్లీం మైనారిటీలతో లోకేష్ సమావేశమై వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా యువనేత మరో మైలురాయిని చేరుకున్నారు. అల్లూరులో 1200 కిలోమీటర్ల మైలురాయికి పాదయాత్ర చేరుకోగా.. అక్కడ మిడుతూరు ఎత్తిపోతల పథకానికి లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యువనేత... ‘‘జనగళమే యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మిడుతూరు, కలమండలపాడు, మాదిగుండం, పారమంచాల చెరువులకు నీరు చేరుతుంది. తద్వారా 22వేల ఎకరాలకు సాగునీరు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల్లో 60వేలమంది ప్రజలకు తాగునీరు అందుతుంది’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు.