NaraLokesh: జాబ్ క్యాలెండర్ లేక యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందన్న యువనేత

ABN , First Publish Date - 2023-05-11T10:56:47+05:30 IST

యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్‌ను ఆయా ప్రాంతాల్లో ప్రజలు కలుస్తున్నారు.

NaraLokesh: జాబ్ క్యాలెండర్ లేక యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందన్న యువనేత

కర్నూలు: యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్‌ను (Nara Lokesh) ఆయా ప్రాంతాల్లో ప్రజలు కలుస్తున్నారు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో 96వ పాదయాత్రను ప్రారంభించిన లోకేష్‌ను తర్తూరు గ్రామస్తులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. అన్ని సమస్యలు తీరుస్తామని యువనేత హామీ ఇచ్చారు. అనంతరం మండ్లెం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి తాము పడుతున్న బాధలను తెలిపారు. మండ్లెం, తంగడంచ గ్రామ పొలిమేరల్లో 300 బావులు ఉన్నాయని... ఈ బావులను గతంలో ఎన్టీఆర్ తవ్వించారన్నారు. అప్పటి నుండి తాము ఒక పంట వేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ నుండి మండ్లెం గ్రామ చెరువులకు నీరు నింపాలని కోరారు. రైతులకు 12 గంటలకు విద్యుత్ ఇవ్వాలని... కొత్త కనెక్షన్లు సత్వరమే ఇవ్వాలన్నారు. తమ గ్రామంలో డి.ఫారం పట్టా పొలాలకు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలని వినతి చేశారు. మండ్లెం, తంగడంచ గ్రామాల్లోని పోరంబోకు పొలాలను రైతులకు పూర్తి హక్కు ఉండేలా పట్టా పుస్తకాలు అందించాలన్నారు. మండ్లెం గ్రామం నుంచి లక్ష్మాపురం తారు రోడ్డు వేయాలని.. మండ్లెం నుండి కొణిదెలకు మెటల్ రోడ్డు వేయాలని కోరారు. చంద్రన్న పెళ్లి కానుకలు ఎస్సీలకు లక్షన్నర, బీసీ, మైనారిటీలకు లక్ష చొప్పున అందించాలన్నారు. మహిళలకు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు 75శాతం రాయితీ ఇవ్వాలన్నారు. డిగ్రీ చదివిన వారికి భృతి అందించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గ్రామస్తులు కోరారు.

నారా లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టని జగన్... రైతుల మోటార్లకు మీటర్ల పెట్టి ఉరితాడు బిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగు, తాగునీరు అందజేస్తామని భరోసా ఇచ్చారు. యేటా జాబ్ కేలండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్ మోసం చేయడంతో యువత పెడతారి పట్టే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటికే పలువురు గంజాయి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగుపర్చి నిరుద్యోగాన్ని అరికడతామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరి పెళ్లికానుకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. డి.ఫారం పట్టాలకు రిజిస్ట్రేషన్ అంశాన్ని.. కర్నాటక రాష్ట్ర విధానాలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. మహిళలకు ప్రోత్సాహకాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎస్సీల సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-11T12:15:39+05:30 IST