Lokesh YuvaGalam: కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లపై టీడీపీ నేతల సమావేశం
ABN , First Publish Date - 2023-08-17T14:00:13+05:30 IST
ఈనెల 19న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు.
విజయవాడ: ఈనెల 19న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) పాదయాత్ర (YuvaGalam Padayatra) చేయనున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కార్యాలయంలో ఆ పార్టీ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఈనెల 19 నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలో లోకేశ్ పాదయాత్ర, సభ నేపథ్యంలో ఏర్పాట్లపై నేతలు చర్చించారు. అనంతరం కేశినేని చిన్ని (TDP Leader Kesineni Chinni) మాట్లాడుతూ.. నారా లోకేష్ యాత్ర ఈనెల 19న ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడకు చేరుకుంటుందన్నారు. మూడు రోజుల పాటు యాత్ర ఈ జిల్లాలో ఉంటుందని తెలిపారు. వేలాది మందితో గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని... ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు కష్టాలు పడకూడదని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. నారా లోకేశ్ పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలుకుతామని అన్నారు. రాష్ట్ర వాప్తంగా ఆయన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని.. లోకేశ్ సభకు వేలాదిగా తరలివచ్చే కార్యకర్తల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాబై వేల మందితో లోకేశ్ పాదయాత్ర ఈ జిల్లాలో కొనసాగుతోందని కేశినేని చిన్ని వెల్లడించారు.
బుద్దా వెంకన్న (Budda venkanna) మాట్లాడుతూ.. నారా లోకేశ్‌కు వస్తున్న ప్రజాదరణతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలు లోకేశ్‌కు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ నాయకుల మధ్య ఎటువంటి వర్గ విభేదాలు లేవని స్పష్టం చేశారు. గ్రూపులు ఎవరూ లేరని.. లోకేశ్ యాత్రలో నాయకులంతా కలిసి స్వాగతం పలుకుతారన్నారు. గన్నవరం సభను కూడా విజయవంతం చేసి చూపిస్తామన్నారు. అందరం సమిష్టిగా కలిసి టీడీపీ కోసం పని చేస్తామన్నారు. విజయవాడలో మూడు సీట్లు టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సజ్జల వ్యాఖ్యలు, జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. టీడీపీకి గన్నవరం కంచుకోట అని.. వంశీ కూడా టీడీపీ నుంచి గెలిచే.. వైసీపీలోకి వెళ్లారని గుర్తుచేశారు. యార్లగడ్డ వెంకట్రావును వైసీపీ పెద్దలే మోసం చేశారన్నారు. తల్లిని, చెల్లినే వదిలేసిన వాళ్లకి.. యార్లగడ్డ ఒక లెక్క కాదన్నారు. టీడీపీ కార్యకర్తల బలంతో నడిచే పార్టీ అని.. 2024 ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. చంద్రబాబు పాలన, నాయకత్వంపై ప్రజలంతా ఎంతో నమ్మకంతో ఉన్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.