MLA Arthur : వైసీపీ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టాలని చూశారా? ఇదంతా నిజమేనా?
ABN , First Publish Date - 2023-03-29T10:27:43+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ప్రలోభ పెట్టాలని చూశారంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలనానికి తెరదీశారు. విజయ్ అనే వ్యక్తి తనను ప్రలోభ పెట్టాలని చూశారని వెల్లడించారు.
నంద్యాల : మొన్న ఎమ్మెల్యే రాపాక (MLA Rapaka Varaprasad).. నిన్న మద్దాలి గిరి (Maddali Giri).. నేడు ఎమ్మెల్యే ఆర్ధర్ (MLA Arthur).. వరుసపెట్టి తమను ప్రలోభ పెడుతూ కాల్స్ వచ్చాయంటూ రచ్చకు తెరదీశారు. అసలు ఏంటీ వరుస? ఇంకెంత ఉంది ఉన్నారు ఈ లిస్ట్‌లో? ఇంకెంత మంది వచ్చి తమను ప్రలోభ పెట్టేందుకు చూశారంటూ ప్రకటనలు ఇస్తారు? అసలు ఇదంతా నిజమేనా? లేదంటే ఏదైనా ప్లాన్ ప్రకారం జరుగుతోందా? ఒకవేళ తమను ప్రలోభ పెట్టాలని చూస్తే వెంటనే విషయాన్ని సీఎం జగన్ (CM Jagan) వద్దకు తీసుకెళ్లాలి కదా? తీసుకెళితే ఆయన అలెర్ట్ అయిపోయి ఒక విప్ జారీ చేసి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోకుండా ఉండేవారు కదా? ఇన్ని రోజుల పాటు మీనమేషాలు ఎందుకు లెక్కించినట్టు? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఎందుకు క్యూ కట్టి మరీ ఇప్పుడు బయటకు వస్తున్నారు? అనే ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ప్రలోభ పెట్టాలని చూశారంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తాజాగా సంచలనానికి తెరదీశారు. విజయ్ అనే వ్యక్తి తనను ప్రలోభ పెట్టాలని చూశారని వెల్లడించారు. తాను డబ్బుకు లొంగే వ్యక్తిని కాదని ఫోన్ కట్ చేశానని తెలిపారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఒకరి సానుభూతితో అధికారంలోకి రాదలుచుకోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ టికెట్ ఎవరికీ ఇచ్చినా సంతోషంగా పని చేస్తానని ఎమ్మెల్యే ఆర్థర్ వెల్లడించారు. అయితే నిజంగానే ఆర్ధర్‌ను ఎవరైనా ప్రలోభ పెట్టాలని చూశారా? లేదంటే ఆయనే రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎవరికి జగన్ టికెట్ ఇచ్చినా సంతోషంగా పని చేస్తానని చెబుతూనే.. తాను ప్రలోభాలకు లొంగలేదనే సంకేతాలను సీఎంకి పంపిస్తున్నారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ తనను ఎవరో ప్రలోభపెట్టాలని చూస్తే ఇన్ని రోజుల పాటు బయట పెట్టకుండా ఎందుకు ఆగారనేది చర్చనీయాంశంగా మారింది.