Nellore: తిరుగుబాట్లకు అడ్డా... నెల్లూరు గడ్డ
ABN , First Publish Date - 2023-02-05T21:59:18+05:30 IST
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. అందుకు కారకులెవరైనా సరే...
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. అందుకు కారకులెవరైనా సరే... వారెంతటివారైనా సరే... చివరికి రాజకీయంగా జీవితం ఇచ్చినవారైనా సరే.. తిరగబడి ఎదురు నిలవడం నెల్లూరు నేతల నైజం. ఒకసారి జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే.. 1960 దశకం నుంచే తిరుగుబాట్లు కనిపిస్తాయి. 1965 నుంచి 1989 వరకు పలు సందర్భాల్లో పలువురు నాయకులు పార్టీల అగ్రనాయకుల మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు అదే తరహా తిరుగుబాటు జిల్లాలో కనిపించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ (Congress TDP)లు నెల్లూరు నేతల తిరుగుబాట్ల ప్రభావాన్ని చవిచూడగా తాజాగా అధికార వైసీపీ ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వ్యతిరేకతను ఎలా ఎదుర్కొవాలో తెలియక అల్లాడిపోతోంది.
1952లో బెజవాడ గోపాల్‌రెడ్డిపై తిరుగుబాటు
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో తొలుత చెప్పుకునే పేరు బెజవాడ గోపాల్‌రెడ్డి (Bejawada Gopal Reddy). ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర క్యాబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈయనకు 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచే తిరుగుబాటు ఎదురైంది. 1952 ఎన్నికల్లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేశారు. కోవి రామయ్య చౌదరి అనే నాయకుడి చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమికి కారణం ఏసీ సుబ్బారెడ్డి. గోపాల్‌రెడ్డి నాయకత్వాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నంగా ఇలా చేశారు. దీనికి ప్రతికారంగా అదే నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డిని ఓడించారు. అప్పటి వరకు ఒక పార్టీకి చెందిన వారు ఒకరినొకరు ఓడించుకోవడం అనేది జరగలేదు. తొలిసారిగా నెల్లూరులోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఇది పెద్ద రాజకీయ కుట్రగా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అలా వెన్నుపోట్ల సంస్కృతికి నెల్లూరులోనే బీజం పడిందనే నింద జిల్లాపై పడింది.
1965లో తిరుగుబాటుకు తొలి బీజం
ఆ రోజుల్లో ఒకరిద్దరి చేతుల్లోనే జిల్లా రాజకీయాలు ఉండేవి. వారి మాటే శాసనం. అలాంటి జిల్లాలో నెల్లూరు ఒకటి. అప్పట్లో జిల్లాపై ఆనం కుటుంబ పెత్తనం సాగేది. నీలం సంజీవరెడ్డి (Neelam Sanjiva Reddy) కేబినెట్‌లో ఏసీ సుబ్బారెడ్డి మంత్రిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట శాసనంగా చలామణి అయ్యే రోజులవి. రాష్ట్ర కేబినెట్‌లో సైతం ఈయన పట్టు కొనసాగేది. ఆయనకు ఎదురుగా నిలబడి మాట్లాడే పరిస్థితి కూడా ఎవరికీ లేదు. ఈయన సహకారంతో నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి (Nallapareddy Chandrasekhar Reddy) జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కొంతకాలం ఇద్దరు కలిసే ఉన్నారు. అయితే ఏసీ సుబ్బారెడ్డి కఠినవైఖరిని నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. దీంతో 1965 డిసెంబరులో ఏసీ సుబ్బారెడ్డిపై తిరుగుబాటు ప్రకటించారు. ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఏసీ సుబ్బారెడ్డి (AC Subbareddy) ఆదేశాల మేరకు జిల్లా పరిషత్‌తో చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించారు. కాని అందులో నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ తిరుగుబాటు రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించింది. తొలిసారిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంతర్గత తిరుగుబాటును చవిచూసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆశీస్సులు, అండదండలు అందాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ తిరుగుబాటు తరువాత జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఈ తిరుగుబాటు తదనంతర ఫలితంగా దక్షిణ నెల్లూరులో ఆనం ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. గూడూరు డివిజన్ పూర్తిగా నల్లపరెడ్డి వశం అయ్యింది. నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా విప్లవవీరుడు అనే పేరు వచ్చింది.
1972లో పీవీపై
అప్పట్లో గూడూరు డివిజన్ మొత్తం నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెత్తనం కింద నడిచేది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (Nedurumalli Janardhan Reddy) కూడా నల్లపరెడ్డి అనుచరుడిగా ఉండేవారు. 1972 ఎన్నికల్లో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి గట్టి దెబ్బే తగిలింది. ఆ ఎన్నికల్లో నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి గూడూరు టిక్కెట్టు దక్కలేదు. అప్పటికే రాష్ట్రంలో ప్రముఖ నాయకుడిగా శ్రీనివాసులు రెడ్డి గుర్తింపు పొందారు. గూడూరు డివిజన్‌లో తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. కానీ వ్యక్తిగత రాజకీయ కారణాలతో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు గూడూరు టిక్కెట్టును శ్రీనివాసులురెడ్డికి ఇవ్వకుండా శారదాంబ అనే మహిళకు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానంపై నల్లపరెడ్డి శ్రీనివాసులు తిరుగుబాటు చేశారు. ఇండిపెండెంట్‌గా నిలబడి విజయం సాధించారు. శారదాంబ ఓడిపోయారు. కాని, రాజకీయంగా నేదురుమల్లికి గట్టి పట్టు దొరికింది. నల్లపరెడ్డి అనుచరుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన నేదురుమల్లి 1972 ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని కాదని పీవీ నరసింహారావు పక్షం నిలబడ్డారు. ఆ కృతజ్ఞతతో పీవీ నరసింహారావు నేదురుమల్లికి రాజ్యసభ ఇచ్చారు. అలా నేదురుమల్లి రాజకీయ శకం ఆరంభం అయ్యింది.
1989లో ఎన్టీఆర్‌పై
నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. అప్పట్లో టీడీపీలో ఆయన్ను నంబర్-2గా భావించేవారు. 1998 ప్రాంతంలో ఎన్టీ రామారావు (NT Rama Rao) ఒక ప్రభుత్వ కార్యక్రమ నిమిత్తం నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్వస్థలమైన కోటకు వచ్చారు. ఆ సభా ప్రాంగణంలో ఒక పాత్రికేయుడు ఎన్టీఆర్‌కు ఒక చిన్న కాగితం ముక్క ఇచ్చారు. కోటలో జరుగుతున్న ఒక చెరువు పనిలో అవినీతి జరిగింది అని ఆ చీటీలో రాసున్నారు. దీన్ని చదివిన ఎన్టీఆర్ ఆగ్రహించారు. సమావేశం కాగానే నేరుగా చెరువు పని పరిశీలనకు వెళ్లారు. ఆ తరువాత ఉదయగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెరువు పనుల్లో అవినీతి గురించి ఎన్టీఆర్ ఆవేశంగా మాట్లాడారు. దీన్ని శ్రీనివాసులురెడ్డి అవమానంగా భావించారు. అప్పటి నుంచే అసమ్మతికి బీజం పడిందని రాజకీయ పరిశీలకులు అంటారు. కొద్దికాలానికే శ్రీనివాసులురెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. శీనయ్యసేన అనే పేరుతో రాష్ట్రమంతా పర్యటించి ఎన్టీఆర్‌ను విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తిరుగుబాటు సంచలనం సృష్టించింది.
మూడు దశాబ్దాల తర్వాత నేడు
సుమారు మూడు దశాబ్దాల అనంతరం మళ్లీ నేడు నెల్లూరు జిల్లా రాష్ట్ర ప్రజలను ఆకర్షించింది. అధికార పార్టీలో ఉంటూ అధినాయకత్వం తీరుపై తిరుగుబాటు చేసి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెలుపలికి రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు పొగపెట్టడంతో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆనం కుటుంబానికి చెందిన రామనారాయణరెడ్డి (Ramanarayana Reddy) వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌మోహన్‌రెడ్డిపై ధిక్కార స్వరం వినిపించారు. ఆ వెనువెంటనే తన ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆవేదనతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నుంచి నిష్కమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అధికార పార్టీకి చెందిన ఈ ఇద్దరు నాయకులు జగన్‌రెడ్డిపై, ఆయన ప్రభుత్వంలోని ఇతర ప్రముఖులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటంతో వారం రోజులుగా నెల్లూరు జిల్లా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆకర్షిస్తోంది. ప్రస్తుతానికి వీరి తిరుగుబాటు ప్రభావం రాష్ట్రమంతా కనిపించక పోయినా లోలోన రగిలిపోయే ఎంతోమంది వైసీపీ నాయకుల గొంతులకు జీవం పోసిందనే వాదన వినిపిస్తోంది.