Lokesh YuvaGalam: 2000 కి.మీ. చారిత్రాత్మక మైలురాయికి యువగళం!
ABN , First Publish Date - 2023-07-11T13:50:58+05:30 IST
టీడీపీ యువనే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది.
నెల్లూరు: టీడీపీ యువనే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (Nara Lokesh YuvaGalam Padayatra) 2000 కిలోమీటర్ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది. 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం నెల్లూరు జిల్లా కొత్తపల్లిలో ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డుకు లోకేశ్ శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం యువనేత మాట్లాడుతూ.. ఈఏడాది మొదటి నెలలో కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోందన్నారు. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న యువగళం పాదయాత్ర నేడు కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2వేల కి.మీ. మజిలీకి చేరుకోవడం జీవితంలో మరపురాని ఘట్టంగా అభివర్ణించారు. ఇందుకు గుర్తుగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించినట్లు లోకేశ్ (TDP Leader) వెల్లడించారు.
రచ్చబండలో నారా లోకేష్...
నేడు జిల్లాలోని సిరిపురం క్యాంప్‌సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన లోకేశ్ కావలి నియోజకవర్గం కొత్తపల్లి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు కొత్తపల్లిలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా.. పాదయాత్ర మొదలు పెట్టిన రోజు మీ మనస్సులో ఉన్న ఆలోచన ఏంటి? యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటూ లోకేశ్‌ను ఓ యువతి ప్రశ్నించింది. వరి రైతులు జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ధాన్యం కొనరు. కొంటే డబ్బులు ఇవ్వడం లేదని తెలిపింది. 15 ఏళ్లుగా వచ్చే పెన్షన్ జగన్ కట్ చేశాడని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని... కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని.. జగన్ పాలనలో డ్వాక్రా యానిమేటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నామని.. యువగళం ఏ లక్ష్యంతో చేస్తున్నారని.. టీడీపీ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా అని లోకేశ్‌ను ఓ యువకుడు ప్రశ్నించాడు. టీడీపీ హయాంలో చదువుకునే బాలికలకు సైకిల్స్ అందించారని.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ పథకం ఆపేసిందని యువకుడు తెలిపారు.
లోకేశ్ మాట్లాడుతూ... ‘‘రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగనోరా వైరస్‌కు చంద్రబాబే వ్యాక్సిన్. బాబు అంటే బ్రాండ్... జగన్ అంటే జైలు. కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవలేను. 150వ రోజు, 2 వేల కిలోమీటర్లు మైలురాయిని కూడా కావలిలోనే పూర్తి చేసుకున్నాను. లోటు బడ్జెట్‌తో రాష్ట్రం విడిపోయినా ఎవరికి లోటు లేకుండా పరిపాలించింది చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu). అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా, విదేశీ విద్యలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ. అనేక పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మంది యువతకు టీడీపీ హయాంలో ఉద్యోగాలు కల్పించాం. ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టగానే ప్రజలు పడిపోయారు. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు తెచ్చుకున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు, విపరీతంగా జగన్ (AP CM Jagan) పాలనలో పెరిగిపోయాయి. జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలో టొమాటో రూ.100, పచ్చిమిర్చి రూ.100, చిక్కుడు రూ.100. పండుగ కానుకలు, విదేశీ విద్య, 27 ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు జగన్. బీసీలకు కుర్చీ టేబుల్ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన పన్నులు అన్ని తగ్గిస్తాం. పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. నేను అంబేద్కర్ రాజ్యాంగం నమ్ముకున్నా. అదే ధైర్యంతో పాదయాత్ర చేస్తున్నాను. జగన్ పాలనలో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. భయం పోవాలి అనే ఉద్దేశంతోనే యువగళం పాదయాత్ర మొదలు పెట్టాను. యువగళం మీ గళాన్ని వినిపించడానికి ఒక వేదిక. సక్సెస్‌కు షార్ట్ కట్ లేదు యువత కష్టపడితేనే జీవితంలో విజయం సాధిస్తారు. టీడీపీ హయాంలో వరి రైతులకు పెట్టుబడి రూ.20 వేలు ఉంటే జగన్ పాలనలో రూ.40 అయ్యింది. నెల్లూరు జిల్లాకు చెందిన కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి రైతు సమస్యల పై అవగాహన తక్కువ. కల్తీ లిక్కర్‌పై అవగాహన ఎక్కువ. జగన్ పాలనలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం’’ అని యువనే చెప్పుకొచ్చారు.
నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నా: యువనేత
‘‘టీడీపీ హయాంలో రైతులకు రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు, ఇన్పుట్ సబ్సిడీ అందించాం. జగన్ పాలనలో రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు లేని యువత కు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. జగన్ 6 లక్షల పెన్షన్లు రద్దు చేసాడు. గెలిచిన వెంటనే రూ.3 వేల పెన్షన్ ఇస్తానని మోసం చేసాడు. ఇప్పుడు కరెంట్ బిల్లుకి లింక్ పెట్టి పెన్షన్ కట్ చేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన 6 లక్షల పెన్షన్ అందిస్తాం. మహిళల సమస్యలు తెలుసుకున్న తర్వాత మహా శక్తి కార్యక్రమం ప్రకటించాం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లల కోసం ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు. దీపం పథకం ద్వారా ప్రతి ఏడాది 3 సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ పాలనలో కరెంట్ బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. మీ సేవ, అంగన్వాడీ, డ్వాక్రా యనిమేటర్లు, గోపాల మిత్రులు ఇలా అందరినీ జగన్ వేధిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ వేతనం పెంచుతాం. నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నాను. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతారు. జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాడు. స్కూల్స్ మూసేస్తున్నాడు. టీచర్ల పోస్టులు భర్తీ చెయ్యడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన కేజీ నుండి పీజీ విద్యను ప్రక్షాళన చేస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్థులను సిద్దం చేస్తాం. అవసరమైన స్కూల్స్, పెండింగ్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం’’ అంటూ లోకేశ్ హామీ ఇచ్చారు.