Somireddy: మంత్రి కాకాణి చెప్పినవన్నీ చేస్తే బాధ్యులవుతారు... ఎవ్వరినీ వదలం..
ABN , First Publish Date - 2023-10-06T13:00:16+05:30 IST
మంత్రి కాకాణి మాటలు విని అధికారులు చాలా తప్పులు చేశారని.. ఇప్పుడు వారంతా పనిష్మెంట్లు తీసుకుంటున్నారని - మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Minister Kakani Goverdhan Reddy) మాటలు విని అధికారులు చాలా తప్పులు చేశారని.. ఇప్పుడు వారంతా పనిష్మెంట్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Former Minister Somireddy Chandramohan Reddy) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ డీఎఫ్ఓ మంగమ్మ, రేంజర్ మారుతీప్రసాద్‌లు 16 ఎకరాల గ్రామనత్తం భూముల్లోని గుంతల నుంచి రూ.కోటి విలువ చేసే రొయ్యలని సముద్రంలోకి వదిలేశారన్నారు. అటవీ భూములు కాకున్నా, హైకోర్టు స్టే ఉన్నా లెక్కచేయలేదన్నారు. ఆ కేసులో వారిద్దరూ చెరో రూ.లక్ష చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని... లేకుంటే 15 రోజులు పాటు సివిల్ శిక్ష వేసిందని.. వారిద్దరి ప్రమోషన్లు ఆగిపోయాయని తెలిపారు. కాకాణి వల్ల వెంకటాచలం పీఎస్‌లో అయిదుగురు సస్పెన్షన్‌కు గురయ్యారన్నారు. ఆరుగురు తహాశిల్దార్లపై విచారణ జరుగుతోందని... వారిలో ఒకరు వెంకటాచలంలో పనిచేసిన వారే అని చెప్పుకొచ్చారు. మంత్రి కాకాణి చెప్పినవన్నీ చేస్తే బాధ్యులవుతారన్నారు. చాలా మంది అధికారులు సర్వేపల్లిలో పనిచేయలేమని నిజాయితీగా వెళ్లిపోయారని తెలిపారు. తప్పులు చేసే అధికారులు ఎవ్వరినీ వదలమని... న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటామని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.