Yuvagalam Padayatra: 150 రోజులకు యువగళం పాదయాత్ర.. లోకేష్‌కు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2023-07-08T11:25:29+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా 150 రోజులకు చేరుకుంది.
నెల్లూరు: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా 150 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు అల్లూరుకు చేరుకున్న లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. అల్లూరులో లోకేశ్‌ను చూసేందుకు భారీగా ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలపైకి ఎక్కి లోకేశ్‌కు ప్రజలు అభివాదం చేస్తున్నారు. మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని.. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను యువనేత తెలుసుకున్నారు. చెత్త పన్ను, బోర్డు పన్ను, ప్రోఫిషనల్ ట్యాక్స్ అంటూ వ్యాపారస్తులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తమపై భారం తగ్గించాలంటూ లోకేష్‌ను వ్యాపారస్తులు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తామని.. దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ అడ్డగోలుగా పెంచేసిన పన్నులు అన్ని తగ్గిస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలపై పెంచిన భారాన్ని కూడా తగ్గిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.