CPI Narayana: జగన్ చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకటే
ABN , First Publish Date - 2023-05-09T12:50:05+05:30 IST
దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడించండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.
ప్రకాశం: దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడించండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మాత్రం మోదీ, జగన్ హటావో అంటూ కార్యక్రమాలు చేపడతామన్నారు. జగన్, మోదీ ఇద్దరు రహస్య బంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. జగన్ (AP CM Jagan) చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకేలా ఉంటాయని వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు ఉన్నారన్నారు. రాజన్న పేరు చెప్పి ఆయనకే జగన్ మూడు నామాలు పెడుతున్నారని మండిపడ్డారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని హితవుపలికారు. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి అంటే ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. మోదీ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్తారన్నారు. బీజేపీతో (BJP) సయోధ్య ఉన్న పార్టీలతో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. మణిపూర్ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే రూ.2500 ఉన్న టికెట్ ధరలను రూ.25 వేలు చేశారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టులు ప్రజల సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం ప్రైవేట్ వాళ్లకు ఇవ్వటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారని.. కేవలం ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారట అంటూ సీపీఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చిందన్నారు. ప్రధాని మోదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారన్నారు. మోదీకి 30 మంది దత్త పుత్రులు ఉన్నారని.. వాళ్ళే దేశాన్ని దోచుకుంటున్నారని తెలిపారు. బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక బీజేపీ చొరవతో సినిమా తీయించారని విమర్శించారు. కర్ణాటకలో గెలుపు కోసం మోదీ మతాల మధ్య చిచుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. అదానీ, మోదీ బంధాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటు గురయ్యేలా చేశారన్నారు. ఏపీలో అడుగడుగునా మోదీకి సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్ ఇద్దరూ కవల పిల్లలన్నారు. రాహుల్ గాంధీని చూసి మోదీ బయపడ బట్టే నిలువ నీడ లేకుండా చేశారని నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.