TDP: చంద్రబాబుపై అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన షరీఫ్
ABN , First Publish Date - 2023-09-26T15:21:29+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ మండిపడ్డారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandrababu) ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (MIM Chief Asaduddin Owaisi) చేసిన వ్యాఖ్యలపై మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ (Former Legislative Council Chairman Sharif) మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యస్పదంగానూ విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు మీద ఎంత దుర్దేశం, కక్ష ఉందో అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ద్వారా అర్థమయ్యాయన్నారు. జైల్లో హ్యాపీగా ఉన్నారు అని చెప్పటానికి అదేమన్నా విహార కేంద్రమా.. లాడ్జా అని ప్రశ్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఖండించారన్నారు. జగన్మోహన్ రెడ్డి (CM Jagan reddy) పార్టీ బెటర్ అని అసదుద్దీన్ ఓవైసీ ఏ విధంగా చెబుతారని నిలదీశారు. ముస్లిం మనోభావాలు దెబ్బతీసిన జగన్‌ను సపోర్ట్ చేయమని చెప్పడం మంచిది కాదన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకున్నారని గుర్తుచేశారు. ముస్లింల సంక్షేమం కోసం పనిచేసిన పార్టీని కాదని నాలుగు సంవత్సరాలుగా మైనార్టీలను పట్టించుకోని వైసీపీ ఎలా సపోర్ట్ చేస్తారని నిలదీశారు. గడిచిన నాలుగేళ్లలో వంద మందికిపైగా మైనార్టీలపై దాడులు జరిగాయన్నారు. చంద్రబాబు మీద ద్వేషంతో కక్షపూరిత ధోరణితో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కానీ, అభ్యర్థులను నిలబెడతానికి కూడా అసద్‌కు ధైర్యం లేదని షరీఫ్ వ్యాఖ్యలు చేశారు.