Atchannaidu: అందుకే హడావుడిగా రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు

ABN , First Publish Date - 2023-10-04T14:40:20+05:30 IST

అమరావతి: ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌కు సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఫైబర్ గ్రిడ్‌లో కుంభకోణం అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన వైకాపా నేతలు... నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం బహిర్గతమైందన్నారు.

Atchannaidu: అందుకే హడావుడిగా రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు

అమరావతి: ఫైబర్ గ్రిడ్ కేసు (Fiber Grid Case)లో నారా లోకేష్‌ (Nara Lokesh)కు సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ (Clean chit) ఇచ్చిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్‌లో కుంభకోణం అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన వైకాపా నేతలు..., నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం బహిర్గతమైందన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందన్నది స్పష్టమైoదన్నారు. ఎన్నికల వరకూ చంద్రబాబు (Chandrababu)ను జైల్లో ఉంచాలని జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) తాపాత్రయపడుతున్నారని, అందుకే హడావుడిగా గురువారం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారని అన్నారు.

చంద్రబాబు అరెస్టు భాజపాకు తెలిసి జరిగిందా?.. తెలియక జరిగిందా? అనేది దేవుడికే తెలియాలని, బాబు అరెస్టు అక్రమమని తెలిసి కూడా భాజపా నేతలు కనీసం స్పందించకపోవటంపై సర్వత్రా చర్చ జరుగుతోందని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ నెల 9వ తేదీలోపు చంద్రబాబు బయటకు వస్తారని యోచిస్తున్నామన్నారు. బాబుతో నేను ఇంటింటి ప్రచారం, రిలే నిరాహారదీక్షలు ఈ నెల 9వ తేదీ వరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు బయటకు వచ్చే ప్రక్రియ ఇంకా ఆలస్యమవుతుంటే, 10వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతామని చెప్పారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై దాదాపు 120 మంది చనిపోయారన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని భువనేశ్వరి ఇప్పటికే నిర్ణయించారని, ఆమెతోపాటు పార్టీ నేతలు వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను చేపడతారని, కోర్టు పరిణామాలు బట్టి 10వ తేదీన నిర్ణయిస్తామని తెలిపారు. నారా లోకేష్ కూడా ఈ వారంలో చంద్రబాబుతో ములాఖత్ అవుతారన్నారు. జనసేనతో సమన్వయం కోసం 5గురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని, వామపక్ష పార్టీలతో పొత్తు అంశం అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు. చంద్రబాబు అరెస్టుతో పార్టీ కార్యక్రమాలు ఏవీ స్తంభించలేదని, ఓట్ల అక్రమాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-04T14:40:20+05:30 IST