TDP: డిగ్రీ లేకుండా.. బీఎల్ కోర్సులో ఎలా చేరారు?.. సీతారాంకు టీడీపీ నేత ప్రశ్న

ABN , First Publish Date - 2023-03-27T12:50:36+05:30 IST

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

TDP: డిగ్రీ లేకుండా.. బీఎల్ కోర్సులో ఎలా చేరారు?.. సీతారాంకు టీడీపీ నేత ప్రశ్న

శ్రీకాకుళం: ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Speaker Tammineni Sitharam)పై టీడీపీ నేత కూన రవికుమార్ (TDP Leader Kuna Ravikumar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు కొన్ని విలువలు పాటించాలని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా వైసీపీ (YCP)ప్రతిపాదిస్తే.. టీడీపీ (TDP), జనసేన (Janasena) కూడా మద్దతు ఇచ్చిందని... రాజకీయ పార్టీలకు అతీతంగా స్పీకర్ ఉండాలని సూచించారు. సభలో సభ్యులు గౌరవాన్ని కాపాడాల్సిన సీతారాం... స్పీకర్ స్థానానికి ఉన్న ఔన్నత్యానికి తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. శాసనసభాపతి స్థానాన్ని తమ్మినేని భ్రష్టుపట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీతారాం ప్రవర్తన ప్రపంచమంతా వీక్షిస్తోందన్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌లో ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో డిగ్రీ పూర్తి చేయలేదని నోటరీ చేసి ఇచ్చారన్నారు. 2019లో మహాత్మగాంధీ లా కాలేజీలో లా కోర్స్‌లో చేరారని ఆయన తెలిపారు.

అయితే డిగ్రీ పాస్ కాకుండా... బి.ఎల్ కోర్సులో ఏ రకంగా చేరారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. డిగ్రీ పూర్తి చేయకుండా... ఎలా సర్టిఫికేట్ పెట్టారని నిలదీశారు. సర్టిఫికేట్ ఫోర్జరీ చేసి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు. సీతారాంకు సిగ్గు, లజ్జ, పరువు ... విలువలు ఉంటే... తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానం గౌరవం కాపాడాలన్నారు. సీఎం జగన్... సీతారాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, సీజేఐ, గవర్నర్, తెలంగాణ గవర్నర్‌కు టీడీపీ తరుపున స్పీకర్‌పై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేస్తున్నామన్నారు. జగన్ స్పీకర్ సీతారాం సర్టిఫికేట్‌ల వ్యవహారంపై సీఐడీ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించాలని కోరుతూ లేఖ రాయనున్నట్లు కూన రవికుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-03-27T12:50:36+05:30 IST