SIT : ఏపీ ప్రభుత్వ ‘సిట్’పై సుప్రీంకోర్టులో కీలక తీర్పు
ABN , First Publish Date - 2023-05-03T11:14:17+05:30 IST
ఏపీ ప్రభుత్వ ‘సిట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఢిల్లీ : ఏపీ ప్రభుత్వ ‘సిట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. హైకోర్టు ఈ కేసు అపరిపక్వ స్థాయిలో జోక్యం చేసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్లనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను త్రోసిపుచ్చుతున్నామని వెల్లడించింది. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్ ప్రాతిప్రదికన ఈ కేసును విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచించింది. జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం తీర్పును వెలువరించింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు సవాల్ చేశారు. దీంతో సిట్‌పై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.