YS Viveka Case: అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీం నోటీసులు
ABN , First Publish Date - 2023-06-19T12:11:12+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (Kadap MP Avinash Reddy) సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌తో పాటు సీబీఐకి (CBI) కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి (Sunitha Reddy) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు సుప్రీంలో సునీత పిటిషన్‌పై విచారణ జరిగింది. సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా (Sr. Council Siddharth Luthra)వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసును విచారించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
కాగా... గత మంగళవారం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. అయితే తమ ముందున్న కేసుల్లో సీనియర్ న్యాయవాదులు వాదించడానికి ధర్మాసనం అనుమతించలేదు. దాంతో సునీతారెడ్డే స్వయంగా వాదనలు వినిపించారు. ఆమెకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సహకరించడానికి ధర్మాసనం అనుమతించింది. తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి దర్యాప్తుకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సునీత తెలిపారు. దర్యాప్తును పూర్తి చేయడానికి సీబీఐ కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరుతోందని, ముందస్తు బెయిల్ రావడంతో ఆయన్ను సీబీఐ కస్టడీలో విచారించలేకపోతోందని అన్నారు. అందుచేత ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. అయితే వేరే ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్న వెకేషన్ బెంచ్, తదుపరి విచారణను నేటి(జూన్ 19)కి వాయిదా వేసింది.