Atchannaidu: జగన్ నువ్వు సక్సెస్ అయి ఉంటావు.. కానీ ఇదే నీకు మరణశాసనం
ABN , First Publish Date - 2023-09-11T11:54:55+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను సోమవారం ఉదయం టీడీపీ నేతలు కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా, ఎమ్మెల్సీలు రామారావు, చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, టీడీపీ నేత కోరాడ రాజబాబు.. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను సోమవారం ఉదయం టీడీపీ నేతలు కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా, ఎమ్మెల్సీలు రామారావు, చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, టీడీపీ నేత కోరాడ రాజబాబు.. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, గవర్నర్‌కు వివరించామన్నారు. ఇంత ప్రముఖ వ్యక్తిని తనకు కూడా తెలియకుండా అరెస్ట్ చేశారని ఆశ్చర్యవ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుందని.. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు చంద్రబాబు మీద, అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల క్రితం కేస్ ఫైల్ చేశారని.. ఇప్పుడు ఎందుకు పేరు వచ్చిందని నిలదీశారు. టీడీపీ ఒంటరిగా గెలుస్తుందని సర్వేలు చెప్పాయని.. జనసేనతో కలిస్తే అడ్రస్ గల్లంతవుతుందని తెలిసిందని.. అందుకే ఇలా తెగబడుతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ప్రమాదకరంగా తయారైందన్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు చేసిన కార్యక్రమాలు ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉన్నాయని.. అందుకే కావాలని ఈ కేసులు ఇరికించి అరెస్టు చేసి జైలు పంపించారని ఆయన ఆరోపించారు.
శాడిస్ట్, సైకో కూడా ఇలా చేయరన్నారు. అంత దారుణంగా 48 గంటల పాటు ఇబ్బంది పెట్టారన్నారు. తమ నాయకుడు మనో ధైర్యాన్ని మాత్రం ఏం చేయలేకపోయారన్నారు. తాము పడి లేచిన కెరటంలా ముందుకు వెళ్తామని తెలిపారు. కేసులో చంద్రబాబు నాయుడుకు, తమకు ఏంటి సంబంధమని.. దీని పరిశీలించిన అధికారులపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని.. అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ‘‘జగన్ నువ్వు సక్సెస్ అయి ఉంటావు కానీ నీకు నీ పార్టీకి ఇది మరణ శాసనం’’ అని హెచ్చరించారు. పోలీస్ వ్యవహారం చూస్తే ఎమర్జెన్సీ తలపిస్తుందన్నారు. ధర్మ పోరాటంలో న్యాయబద్ధంగానే ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందని వివరాలను మీడియాకు ఇస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.