TDP Leader: వైసీపీ నేతలను కాలకేయులతో పోల్చిన అచ్చెన్న...
ABN , First Publish Date - 2023-06-24T13:35:29+05:30 IST
సీఎం జగన్, వైసీపీ నేతలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ నేతలను కాలకేయులతో పోల్చారు.
అమరావతి: సీఎం జగన్, వైసీపీ నేతలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ నేతలను కాలకేయులతో పోల్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ (YCP) కాలకేయులను జగన్ రెడ్డి (AP CM YS Jagan Reddy) దళితులపైకి వదిలారన్నారు. కాలకేయుల సంఘం అధ్యక్షుడిలా వైసీపీ నేత కళ్లం హరికృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో ఆకు రౌడీలు దగ్గర నుంచి బడా నేతల వరకు ప్రజలపై దాడులు చేస్తూ హింసలకు పాల్పడుతున్నారన్నారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి కంతేరు దళితులపై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. దళితులపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు.
వైసీపీ దళిత మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ దాడులు కనిపిచడం లేదా అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతుంటే వైసీపీ దళిత నాయకులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మారణాయుధాలతో అనంతపురంలో స్వైరవిహారం చేసిన నాడే హరికృష్ణారెడ్డిపై చర్యలు తీసుకుని ఉంటే దళితులపై దాడి జరిగేది కాదని ఆయన అన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో హరికృష్ణారెడ్డి లాంటి విషపు నాగులను పాలు పోసి పోషిస్తున్నారని.. వీరి ఆగడాలకు దళితులు బలవ్వాలా అని నిలదీశారు. కాలకేయుల పాలన నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని దళితులు వేచిచూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్దంగా ఉన్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.