Devineni Uma: లోకేశ్ పాదయాత్ర పూర్తైతే వైసీపీ దుకాణం బంద్
ABN , First Publish Date - 2023-07-11T15:35:31+05:30 IST
నాయుడు గారి కొడుకు నాయకుడై ప్రజా సేవకుడై ముందుకు సాగుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.
అమరావతి: నాయుడు గారి కొడుకు నాయకుడై ప్రజా సేవకుడై ముందుకు సాగుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (TDP Leader Devineni Umamaheshwarrao) అన్నారు. నారా లోకేష్ యువగళం 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండపల్లిలో దేవినేని సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర 153 రోజులుగా 53 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుని 2000 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకొందన్నారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని.. నెల్లూరులో ఉత్సాహంగా సాగుతోందని అన్నారు. 3 వేలకు పైగా అర్జీలు తీసుకుని, అన్ని సామాజిక వర్గాలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తు ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
బీసీ, ఎస్సీలో ఎస్టీ, మైనారిటీ, బ్రాహ్మణ అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని తెలుసుకొని వారికి భరోసా ఇస్తున్నారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీ పరంగా వారికి భరోసా ఇస్తున్నారని అన్నారు. రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనే హామీ ఇస్తూ లోకేష్ బాబు ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 1/3 నియోజకవర్గాల్లో లోకేష్ బాబు యువగళం పాదయాత్ర పూర్తయిందని.. పాదయాత్ర పూర్తి అయితే వైసీపీ దుకాణం బంద్ అవుతుందని వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తుకు గ్యారెంటీలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క వర్గానికి అండగా ఉండే విధంగా మేనిఫెస్టో ప్రకటించారన్నారు. విజయదశమికి పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ బంగాళాఖాతంలో కలడం ఖాయమని దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారు.