Devineni Uma: జగన్ సర్కార్‌కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
ABN , First Publish Date - 2023-07-14T09:29:54+05:30 IST
మైలవరంలో జగన్ సర్కార్‌కు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో జగన్ సర్కార్‌కు (Jagan Government) మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Former minister Devineni Uma) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇసుకను గుట్టలు గుట్టలుగా నిల్వ చేసి అమ్మకాలు చేయడంపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ... టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు మూడు కోట్ల రూపాయలు నాబార్డు నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని కట్టడానికి శంకుస్థాపన చేస్తే ఈ నాలుగేళ్లుగా పనులు చేయకుండా ఆపేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ భవనం తాము కట్టామని గొప్పలు చెప్పుకుని సిగ్గు ఎగ్గు లేకుండా శిలాఫలకాలు వేసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. సిగ్గు లేకుండా ఇసుక గుట్టలు పోసి అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్ మీదకు ఇసుక వస్తుందని.. ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లోకి ఇసుక వస్తుంటే తమరు దోచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెలకి రూ.21 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు ఈ ఇసుక డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేను, అధికారులను హెచ్చరిస్తున్నా.. తక్షణమే ఇసుక డంప్ ఇక్కడ నుంచి తీసివేయాలన్నారు. రోగులు, డాక్టర్లు, పనిచేసే సిబ్బంది ప్రాణాలను కాపాడండి ! వారి ప్రాణాల పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆసుపత్రి వద్ద ఇసుక డంపులు పెట్టలేదన్నారు. మార్కెట్ యార్డులో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇసుక డంపులు పెట్టి అమ్ముకోవడానికి వచ్చారా అంటూ నిలదీశారు. ప్రకృతి సంపదను వందల కోట్లు దోచేసి ఇష్ట రాజ్యాంగా అమ్ముకుంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ నుంచి ఇసుక డంపింగ్ యార్డు తొలగించేస్తామని దేవినేని ఉమా హామీ ఇచ్చారు.