YuvaGalam: చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన యువగళం
ABN , First Publish Date - 2023-12-11T11:51:57+05:30 IST
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించింది. యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
కాకినాడ: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించింది. సోమవారం యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్‌తో కలిసి కుటుంబసభ్యులు నారా బ్రహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్ పాదయాత్ర చేస్తున్నారు. చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆనందంతో యువగళం బృందాలు కేరింతలు కొడుతున్నారు. వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది. లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.
లోకేష్ ఏమన్నారంటే..
శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ‘‘వైసీపీ ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3000 కి.మీ. మైలురాయికి చేరింది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా వైసీపీ సర్కారు మూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాను’’ అని యువనేత పేర్కొన్నారు.