YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు
ABN , First Publish Date - 2023-08-26T10:56:33+05:30 IST
కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
ఉమ్మడి కృష్ణా: కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం పోతిరెడ్డిపల్లి క్యాంప్ సైట్ నుంచి 195వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ రోజు లోకేశ్ పాదయాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. పాదయాత్రలో భాగంగా లోకేశ్‌ను నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామస్తులు కలిశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, పిట్టలవారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని కోరారు. ఇవి పూర్తి అయితే తమ గ్రామంలోని తాగు, సాగు నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. టీడీపీ పాలనలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణం వైసీపీ పాలనలో నిలిచిపోయాయన్నారు. తమ గ్రామంలోని ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలని, గ్రామంలో శ్మశానాలు ఆక్రమణకు గురయ్యాయని వాటిని కాపాడాలని వినతి చేశారు. గ్రామంలో అర్హులకు పెన్షన్లు పార్టీలు చూసి ఇస్తున్నారని.. ఈ విధానాన్ని రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్‌కు (CM Jagan) అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ తాగు, సాగునీటి ప్రాజెక్టులపై లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగోవంతు ఖర్చుచేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చింతలపూడి ప్రాజెక్టు, పిట్టలవారిపాలెం వద్ద ఎత్తిపోతల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ఎస్సీ కాలనీలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరిస్తామన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఈరోజు మధ్యాహ్నం ముసునూరులో గ్రామస్తులతో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొననున్నారు.