Panchumarthi Anuradha: బీసీలు పెయిడ్ ఆర్టిస్టులా జగన్ రెడ్డీ?.. వారి నాలుకలు తెగ్గోస్తాం
ABN , First Publish Date - 2023-08-01T12:04:33+05:30 IST
ఎన్నికల సమయంలోనే ఏపీ సీఎం జగన్ రెడ్డికి బీసీలు గుర్తుకొస్తారా అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఎన్నికల సమయంలోనే ఏపీ సీఎం జగన్ రెడ్డికి (AP CM Jagan Reddy) బీసీలు గుర్తుకొస్తారా అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (TDP MLC Panchumarthi Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు పెయిడ్ ఆర్టిస్టులా జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు. బీసీలను పెయిడ్ ఆర్టిస్టులన్న వారి నాలుకలు తెగ్గోస్తామని హెచ్చరించారు. నారా లోకేష్ చేపట్టిన జయహో బీసీ చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందన్నారు. అక్కను వేధించారని ప్రశ్నించిన బీసీ విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌ను సజీవదహనం చేశారన్నారు. జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను హతమార్చిన దుర్మార్గులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి యాదవులను వేధిస్తున్నారన్నారు. నాలుగేళ్లలో 60 మంది బీసీలను చంపేశారని.. 6 వేలమంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టి హింసించింది నిజం కాదా? అని టీడీపీ ఎమ్మెల్సీ ప్రశ్నించారు.
చంద్రబాబు తెచ్చిన రూ. 75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. బీసీల ఉన్నతికి చంద్రబాబు ప్రవేశపెట్టిన 33 స్కీములను రద్దు చేశారన్నారు. చంద్రబాబు టీడీడీ చైర్మన్, ఈవో పదవులు, ఏపీఐఐసీ సహా ఎన్నో పదవులు బీసీలకిస్తే జగన్ రెడ్డి తన సామాజిక వర్గానికే కట్టబెట్టారన్నారు. జోగి రమేష్, కారుమూరి, విడదల రజనీ, మోపిదేవి వంటి పెయిడ్ ఆర్టిస్టులతో బీసీలను తిట్టిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ పొలిట్ బ్యూరోలో 60% బీసీలున్నారని... మరి వైసీపీలో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అయిన తనను ఓడించేందుకు జగన రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు చేశారు.