Lokesh: జగన్‌కు లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్.. ఎమ్మెల్యే వంశీ గురించి యువనేత ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-08-21T21:33:17+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (CM JAGAN), గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై (MLA Vamsi) టీడీపీ యువనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం, విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (CM JAGAN), గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై (MLA Vamsi) టీడీపీ యువనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Padayatra) గన్నవరంలో కొనసాగుతోంది. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి లోకేష్‌కు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. యువగళానికి ఎమ్మెల్యే వంశీ భయపడి పోలీసుల చాటున దాక్కున్నాడoటూ తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు. గన్నవరం రహదారి మీదుగా రావాలంటూ శ్రేణులు పట్టు పట్టారు. పోలీసుల చాటున ఎమ్మెల్యే నక్కితే, తాము ప్రజల చెంతకు వెళ్తామంటూ పాదయాత్రను లోకేష్ గన్నవరం ఊళ్లోకి మళ్లించారు. గన్నవరం సెంటర్ లో స్టూల్ పై నిల్చొని లోకేష్ ప్రజలకు అభివాదం చేశారు. లోకేష్ వెంట యార్లగడ్డ ఉన్నారు. గన్నవరం గడ్డ తెలుగుదేశం అడ్డ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్రను తెలుగుదేశం శ్రేణులు ముందుకు కొనసాగించారు. గన్నవరం సమీపంలోని హెచ్‌సీఎల్ వద్ద నుంచి లోకేష్ పాదయాత్ర సాగింది. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి హెచ్‌సీఎల్ కంపెనీని తానే తెచ్చానంటూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
"ఇది కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 2018లో నేను ఐటీ మంత్రిగా ఉన్నపుడు తెచ్చిన హెచ్ సీఎల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. రూ.750 కోట్లతో ఏర్పాటైన ఈ సంస్థ 10వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో ఏర్పాటైంది. జగన్ మాదిరి మేం చదువుకున్న యువతతో చేపలదుకాణాలు, మటన్ మార్టులు పెట్టించలేదు. గంజాయి బానిసలుగా మార్చి మత్తులో ముంచలేదు. రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను జె-ట్యాక్స్ కోసం పక్కరాష్ట్రాలకు తరిమేయలేదు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు అయితే, అరాచకానికి, విధ్వంసానికి కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి!." అని లోకేష్ విమర్శలు గుప్పించారు.