Ganta Srinivasa Rao: చంద్రబాబు కోసం తెలుగు వాళ్లంతా ఏకమవుతున్నారు
ABN , First Publish Date - 2023-09-16T14:45:12+05:30 IST
చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా ఏకమవుతున్నారు. పరిపాలనా సంస్కరణలతో ప్రయోజనం పొందిన వారు వేలాదిగా ముందుకు వస్తున్నారు.
విశాఖ: టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆశాభావం వ్యక్తంచేశారు. వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గంటా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు జైలు నుంచి నిర్ధిషిగా బయట పడాలని మొక్కుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా ఏకమవుతున్నారు. పరిపాలనా సంస్కరణలతో ప్రయోజనం పొందిన వారు వేలాదిగా ముందుకు వస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరులో ఐటీ ఉద్యోగులు కృతజ్ఞతతో ముందుకు వచ్చి మద్దతిస్తున్నారు. విదేశాల నుంచి కూడా చంద్రబాబుకు మద్దతు వస్తోంది. ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరేపిస్తే రోడ్లపైకి వచ్చిన వారు కాదు. ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ (Cm jagan) శాడిజంతో చంద్రబాబును కావాలనే జైలకు పంపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును తిరిగి పైకి తెచ్చి చంద్రబాబుపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు తాను వెళ్లాలని చూస్తే అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామం. రేపు సాయంత్రం ఉమ్మడి సమావేశం పెట్టాలని చూస్తున్నాం. చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపి జగన్ కొరిమితో తల గోక్కున్నట్లయ్యింది. చంద్రబాబు భద్రత పట్ల మాకు ఆందోళన ఉంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రజనీ కాంత్ సంఘీభావం ప్రకటించారు. మద్దతుగా ప్రకటన చేశారు. చంద్రబాబు సచ్చీలత తనకు తెలుసని నిర్భయంగా తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల పట్ల జగన్ ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. ప్రముఖ నటులు, డైరెక్టర్లు జగన్ వల్ల ఇబ్బందులకు గురయ్యారు.’’ అని తెలిపారు.