Ganta Srinivasa Rao : పోవాలి జగన్... బై బై జగన్...
ABN , First Publish Date - 2023-10-12T13:05:28+05:30 IST
ప్రజలను మభ్య పెట్టడానికే విశాఖ రాజధాని ప్రకటనలు చేస్తోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖకు సీఎం రావడానికి డొంక తిరుగుడు జీవోలు ఎందుకని ప్రశ్నించారు.
విశాఖ : ప్రజలను మభ్య పెట్టడానికే విశాఖ రాజధాని ప్రకటనలు చేస్తోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖకు సీఎం రావడానికి డొంక తిరుగుడు జీవోలు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిపై 2014లో జగన్ ఏమి మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్న జగన్ చేసిన వ్యాఖ్యలను మీడియాకు గంటా వినిపించారు. రాజధానిపై జగన్ యూ టర్న్ తీసుకున్నారన్నారు. న్యాయస్థానాల్లో ఈ అంశం పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని మర్చిపోయారా? అని గంటా ప్రశ్నించారు.
‘‘99 శాతం ప్రజలు జగన్ విశాఖకు రావద్దని అంటున్నారు. కావాలంటే ప్రజా అభిప్రాయం సేకరణ చేయండి. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే అభివృద్ధి జరుగుతుందని తొలుత స్వాగతించాము. కానీ ఇప్పటి వరకూ ఒక ఇటుక కూడా వేయలేదు. గండికోట రహస్యంలా రుషి కొండ వ్యవహారం ఉంది. రుషికొండలో వాడిన మెటీరియల్ చాలా విలువైనవి ఉన్నాయి. బాత్రూం కమోడు రూ.25 లక్షలతో నిర్మించారంటే.. మిగిలిన విషయాలు ఆలోచించుకోవచ్చు. 175 కి 175 కాదు.. వైసీపీకి ఎందుకు ఓట్లు వేయాలి. ప్రజలకు వైసీపీ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు.
దేశంలో అత్యధిక ధనిక ముఖ్యమంత్రి జగన్.. అత్యంత సంపన్నుడు. ఇటువంటి వ్యక్తి పేదల పక్షాన పోరాడుతారా? మద్యపాన నిషేధం చేయకుండా... మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు జగన్. జగన్ విశాఖకు దొడ్డి దారిన రావడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. పోవాలి జగన్... బై బై జగన్ అని ప్రజలు అంటున్నారు’’ అని గంటా అన్నారు.