Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?
ABN , Publish Date - Dec 16 , 2023 | 11:34 AM
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో దూసుకెళ్తోంది. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు.
అనకాపల్లి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) అనకాపల్లి జిల్లాలో దూసుకెళ్తోంది. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను యలమంచిలి నియోజకవర్గం, అరబుపాలెం బీసీలు కలిసి... వారి సమస్యలు చెప్పుకున్నారు.
దీనిపై లోకేష్ స్పందిస్తూ.. జగన్ (CM Jagan) అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760కోట్లు దారిమళ్లించారని ఆరోపించారు. బీసీలకు ఎన్టీఆర్ రాజకీయాల్లో 24శాతం రిజర్వేషన్ ఇచ్చారన్నారు. చంద్రబాబు బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. బీసీల్లోని అన్ని కులాలను గుర్తించి అన్ని రంగాల్లో ముందుకు తెస్తామన్నారు. సొంతిల్లు లేని పేదలకు స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని యువనేత స్పష్టం చేశారు.
అనంతరం మునగపాక శివార్లలో బెల్లం తయారీదారులను లోకేష్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి, డ్రగ్స్, దొంగసారా కాసేవాళ్లను పట్టుకోవడం చేతగాని జగన్ ప్రభుత్వం రైతులు, వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం దారుణమని యువనేత మండిపడ్డారు. విశాఖ ఏజన్సీలో ప్రభుత్వ పెద్దల అండతోనే గంజాయి సాగు జోరుగా సాగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్లం తయారీదారులు, వ్యాపారులపై ఆంక్షలను తొలగించి స్వేచ్చగా విక్రయాలకు అవకాశం కల్పిస్తామన్నారు. చెరకు రైతులకు ప్రభుత్వం తరపున సహకారం అందించి ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
అలాగే జీవీఎంసీ 82వ వార్డులో మధ్యాహ్నం విడిది కేంద్రం వద్ద యాదవ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...