YuvaGalam: లోకేశ్‌ను కలిసిన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వాసితులు
ABN , First Publish Date - 2023-08-28T13:59:40+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఏలూరులో కొనసాగుతోంది.
ఏలూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara lokesh) ఏలూరులో కొనసాగుతోంది. సోమవారం 197వ రోజు పాదయాత్రను (YuvaGalam Padayatra) లింగపాలెం మండలం సుందరరావు పేట నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాచింతలపూడి మండలం వెలగలపల్లి వద్ద లోకేశ్‌ను ప్రగడవరానికి చెందిన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులు కలిశారు. వారి సమస్యలను యువనేతకు చెప్పుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తాము భూములు ఇచ్చామని.. ఎకరానికి రూ.30లక్షలు ఇప్పిస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటం చేయించారన్నారు. రూ.30లక్షలు ఇప్పించే అంశంపై పాదయాత్ర సందర్భంగా జగన్ గతంలో హామీ ఇచ్చి నేడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ భూములు నేడు 22ఏ పరిధిలో ఉండడంతో తాము భూములు తాకట్టు పెట్టుకోవడం, అమ్మే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో కూడా తమ భూములు తమకు అక్కరకు రాలేని దుస్థితి వచ్చిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలని చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులు కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ.. ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేని దద్దమ్మ ముఖ్యమంత్రి కొత్త ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించారు. జగన్ మాయమాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294కోట్లు ఖర్చుచేస్తే, వైసిపీ వచ్చాక నాలుగోవంతు ఖర్చుచేయలేదని విమర్శించారు. జగన్ దివాలాకోరు పాలనలో మెయింటెనెన్స్ లేక అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయన్నారు. అధికారంలోకి వచ్చాక భూనిర్వాసితులకు పరిహారం అందజేసి, చింతలపూడి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.