Sankranti: ఒక్క బరిలోనే రూ.4 కోట్లకు పైగా బెట్టింగ్.. కోడి గెలిచింది.. బుల్లెట్ తెచ్చింది.. సంక్రాంతి సిత్రాలు..!
ABN , First Publish Date - 2023-01-15T20:57:06+05:30 IST
సంక్రాంతి కోడిపందేల జోరులో కోట్ల రూపాయలు చేతుల మారాయి. భీమవరం మండలం డేగాపురంలో నిర్వహించిన ఒక బరిలోనే కోడిపందేలు నాలుగు కోట్లకుపైగా జరగడంతో పాటు..
భీమవరం రూరల్/ కాళ్ళ/ ఉండి/ పాలకోడేరు/ నరసాపురం/ యలమంచిలి/ఆకివీడు రూరల్/తణుకు/పెంటపాడు/తాడేపల్లిగూడెం రూరల్/వీరవాసరం/భీమవరం క్రైం/మొగల్తూరు/పెనుమంట్ర/పాలకొల్లు అర్బన్: సంక్రాంతి కోడిపందేల జోరులో కోట్ల రూపాయలు చేతుల మారాయి. భీమవరం మండలం డేగాపురంలో నిర్వహించిన ఒక బరిలోనే కోడిపందేలు నాలుగు కోట్లకుపైగా జరగడంతో పాటు గుండాటల్లో కూడా లక్షలు చేతులు మారాయి. మండలంలో లోసరి, చినఅమిరం, రాయలం, ఈలంపూడి, తాడేరు, తుందుర్రు ప్రాంతాల్లో బరులు నిర్వహించారు. కాళ్ళ మండలం సీసలి గ్రామం బరిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు కోడిపందేలను ప్రారంభించారు. సీసలి, పెదఅమిరం, కాళ్ళ, జక్కరం, కాళ్ళకూరు, మాలవానితిప్ప, బోస్ కాలనీ తదితర గ్రామాల్లో యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట, గుండాటలు జోరుగా సాగాయి. పందేల్లో కోజాలు రూ.2వేల నుంచి 5వేల వరకు రేట్లు పలికాయి. కోడిపందేలు తిలకించేందుకు తెలంగాణ ప్రాంతాల నుంచి హాజరయ్యారు.
మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలంలోని ఉండి, యండ గండి, చెరుకువాడ, పెదపుల్లేరు, పాములపర్రు, కోలమూరు, వాండ్రం తది తర గ్రామాలలో పందేలు నిర్వహించారు. పాలకోడేరు మండలంలో గుండాట, పేకాట జోరుగా సాగాయి. ఉదయం నుంచే కోడిపందేలు, జూదాలు యథేచ్ఛగా సాగాయి. నరసాపురం మండలంలో బరుల్లో కోడిపుంజులు కత్తులు దూశాయి. పట్టణ, మండలంలో పరిధిలో మొత్తం 20కుపైగా బరులు వెలిశాయి. వీవర్స్‌కాలనీ బరిలో చైర్‌పర్సన్ వెంకటరమణ, వైస్ చైర్మన్ కామన నాగినిలు కోడి పుంజులను బరిలోకి వదిలి పందాలను ప్రారంభించారు. ఇదే బరిలో 8వార్డు కౌన్సిలర్ బర్రె జయరాజు కూడా పందెం కోడిని వదలడం గమనార్హం. యలమంచిలి మండలంలో ఉదయం 10 గంటలకు కోడిపందేలు, 12 గంటల నుంచి గుండాట ప్రారంభమయ్యాయి. యలమంచిలిలో మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బరి ప్రాంగణంలో యువత, మహిళలు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పఢ్డారు.
పల్సర్ బైక్ ఝాన్సీ బృందం చేసిన డాన్స్ ప్రదర్శన చూసేందుకు అధికసంఖ్యలో ప్రజలు విచ్చేశారు. ఆకివీడు మండలం దుంపగడప గేటు వద్ద ఏర్పాటు చేసిన బరి ఈ ప్రాంతంలోనే అతి పెద్ద బరిగా నిలిచింది. ఇండోర్ స్టేడియం మాదిరిగా సిద్ధం చేసి ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. తణుకు పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు ప్రారంభం అయ్యాయి. పందేల మాటున జూద క్రీడలు జరిగాయి. పెంటపాడు మండలంలో కోడిపందేల బరులు వెలిశాయి. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట జోరుగా సాగాయి. మద్యం ఏరులై పారింది. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. మండలంలోని పెదతాడేపల్లి, చినతాడేపల్లి, కొమ్ముగూడెం, మారంపల్లి, మోదుగగుంట, అప్పారావుపేట గ్రామాల్లో పందేలు నిర్వహించారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పందేలు జరిగాయి. సంక్రాంతి జూదం, కోడి యుద్ధ్దం ప్రారంభమైంది. అధికారుల ఆదేశాలు, హెచ్చరికలను పందెం రాయుళ్లు బేఖాతరు చేశారు. యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహించారు.
భీమవరం పట్టణంలో ఇండస్ట్రీయల్ ఏరియా, చినరంగనిపాలెంలో బరులు వెలిశాయి. చినఅమిరం గ్రామంలో కూడా కోడిపందేలు నిర్వహించారు. బరుల వద్ద గుండాటలు భారీ ఎత్తున వెలిశాయి. దీంతో పాటు మద్యం కూడా ఏరులైపారింది. మొగల్తూరులో జరిగిన కోడి పందేలకు తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చారు. వారి వాహనాలతో తీర గ్రామాల్లో సందడి నెలకొంది. పెనుమంట్ర మండలం మార్టేరు పందెం బరిలో 21 పందేల్లో అధిక శాతం పందెం గెలు పొందిన వారికి బుల్లెట్‌వాహనం బహుమతిగా ఇస్తామంటూ నిర్వాహ కులు ప్రచారం చేశారు. పాలకొల్లులో యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహించారు. పూలపల్లిలోని ఓ బరివద్ద అధిక పోటీల్లో విజయం సాధించిన కోడి యజమానికి బుల్లెట్ మోటార్ బైక్‌ను ప్రదర్శనగా ఉంచారు. ఈవిధంగా ఇద్దరికి రెండు మోటారు బులెట్‌లు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.