YuvaGalam: 198వ రోజుకు లోకేశ్ పాదయాత్ర.. యువనేతకు వినతిపత్రం ఇచ్చిన తీగలవంచ గ్రామస్తులు

ABN , First Publish Date - 2023-08-29T11:04:24+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 198వ రోజుకు చేరుకుంది. మంగళవారం జిల్లాలోని చింతలపూడి మండలం తీగలవంచ విడిది కేంద్రం నుంచి యువనేత పాదయాత్రను ప్రారంభించారు.

YuvaGalam: 198వ రోజుకు లోకేశ్ పాదయాత్ర.. యువనేతకు వినతిపత్రం ఇచ్చిన తీగలవంచ గ్రామస్తులు

పశ్చిమగోదావరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 198వ రోజుకు చేరుకుంది. మంగళవారం జిల్లాలోని చింతలపూడి మండలం తీగలవంచ విడిది కేంద్రం నుంచి యువనేత పాదయాత్రను ప్రారంభించారు. చింతలపూడి మండలం తీగలవంచ వద్ద లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. లోకేశ్‌కు హారతులు పట్టి, పూలు చల్లి మహిళలు స్వాగతం పలికారు. అనంతరం యువనేతను కలిసిన తీగలవంచ గ్రామస్తులు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. చింతలపూడి నుండి టి.నర్సాపురం మండల కేంద్రం వరకు రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించాలని కోరారు. రేచర్ల గ్రామం వద్ద రోడ్డుకుచెరువు మరమ్మతులు చేపట్టాలన్నారు. తీగలవంచ గ్రామంలోని విద్యుత్ లైన్లను మార్చి కొత్తవి ఏర్పాటుచేయాలని గ్రామస్తులు వినతి చేశారు.


యువనేత లోకేశ్‌ స్పందిస్తూ.. జగన్ దివాలాకోరు పాలనలో రోడ్లపై తట్ట మట్టిపోసే దిక్కులేదన్నారు. కాంట్రాక్టర్లకు రూ.1.30లక్షల కోట్ల బిల్లులు బకాయి పెట్టడంతో జగన్ ముఖం చూసి పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. అధికారంలోకి రాగానే చింతలపూడి - టి నర్సాపురం, రేచర్ల రోడ్లను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా కోకో పంటను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

మరోవైపు లోకేశ్‌ ఈ రోజు పోలవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. మధ్యాహ్నం శ్రీరామవరం భోజన విడిది కేంద్రం వద్ద పోలవరం నిర్వాసితులతో యువనేత ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Updated Date - 2023-08-29T11:04:24+05:30 IST