Lokesh YuvaGalam: నర్సాపురంలో యువగళానికి బ్రహ్మరథం.. ప్రజల అపూర్వ స్వాగతం

ABN , First Publish Date - 2023-09-07T11:53:48+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో యువనేత పాదయాత్ర సాగుతోంది. ఈరోజు(గురువారం) నరసాపురం మండలం సీతారామపురం నుంచి 207వ రోజు పాదయాత్రను లోకేశ్ మొదలుపెట్టారు.

Lokesh YuvaGalam: నర్సాపురంలో యువగళానికి బ్రహ్మరథం.. ప్రజల అపూర్వ స్వాగతం

పశ్చిమగోదావరి: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో యువనేత పాదయాత్ర సాగుతోంది. ఈరోజు(గురువారం) నరసాపురం మండలం సీతారామపురం నుంచి 207వ రోజు పాదయాత్రను లోకేశ్ మొదలుపెట్టారు. నర్సాపురంలో యువగళానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. యువనేత లోకేశ్‌‌కు నర్సాపురం పట్టణ ప్రజల అపూర్వ స్వాగతం పలికారు. అడుగడగునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారు. యువనేతకు సంఘీభావంగా భారీగా రోడ్లవెంట ప్రజలు బారులు తీరారు. లోకేశ్‌ను కలిసి ఫోటోలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడుతున్నారు. భవనాలపై నిలబడి యువనేతకు స్థానికులు అభివాదం తెలుపుతున్నారు. వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.


లోకేశ్‌కు వినతి పత్రం ఇచ్చిన చేనేత కార్మికులు

నర్సాపురం జగన్నాథ ఆలయం సమీపంలో చేనేత కార్మికులు లోకేశ్‌ను వినతిపత్రం అందజేశారు. చేనేతల కుటుంబసభ్యులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత సొసైటీలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని వినతి చేశారు. ఎన్టీఆర్ హయాంలో మాదిరి జనతా వస్త్రాల పంపిణీ చేపట్టి చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని చేనేత కార్మికులు కోరారు.

నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చేనేత కార్మికులకు రూ.110 కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నామన్నారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేసి సంక్షేమ పథకాలన్నీ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేసేలా కేంద్రంతో మాట్లాడతామని, వీలుపడకపోతే రాష్ట్రమే జీఎస్టీ భరించేలా చేస్తామన్నారు. మగ్గం ఉన్న ప్రతీ చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని యువనేత హామీ ఇచ్చారు.


నర్సాపురం ప్రజలతో యువనేత..

పాదయాత్రలో భాగంగా లోకేవ్‌ను నర్సాపురం ప్రజలు కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ ఏర్పడి 70 ఏళ్లు అయినా ప్రధాన డంపింగ్ యార్డ్ సమస్య ఉందన్నారు. నీటి ఎద్దడి నివారణకి టీడీపీ హయాంలో పైపు లైన్లు వేశారని.. వాటినే వైసీపీ ప్రభుత్వం తవ్వి బయటకు తీసి మళ్లీ అమర్చారు తప్ప కొత్త నిర్మాణం చేయలేదన్నారు. నిధులు దుర్వినియోగం చేసి కూడా నీటి ఎద్దడి తీర్చలేకపోయారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని ప్రజలు తెలియజేశారు.

దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక నర్సాపురంలో శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వాటర్ గ్రిడ్ ద్వారా 24 గంటల పాటూ శుద్ధమైన నీటిని కుళాయి ద్వారా ఇంటింటికీ అందిస్తామన్నారు. నర్సాపురంలో పేరొందిన లేస్ పరిశ్రమకు రాయితీలిచ్చి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-09-07T11:53:48+05:30 IST