AP MLC Results: వైసీపీ అభ్యర్థికి ఏ రౌండ్‌లోను దక్కని ఆధిక్యం
ABN , First Publish Date - 2023-03-17T20:27:24+05:30 IST
ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ (YCP) బొక్క బోర్లా పడింది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకు గాను
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ (YCP) బొక్క బోర్లా పడింది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకు గాను 2,00,926 మంది (69.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లను మొత్తం ఎనిమిది రౌండ్లుగా విభజించి గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు. అయితే మొదటి నుంచి చివరి వరకూ ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు (TDP candidate Chiranjeevi Rao) ఆధిక్యం సాధించారు. కనీసం ఒక్క రౌండ్‌లో కూడా వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ (YCP candidate Seethamraju Sudhakar)కు మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు 82,956 (43.88 శాతం) ఓట్లు లభించగా, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,641 (29.43 శాతం) ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థికి 27,315 ఓట్ల మెజారిటీ లభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం... ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. ప్రభుత్వంపై విద్యావంతుల్లో ఇంత వ్యతిరేకత ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.
విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు నిర్ణయాన్ని ఈ ప్రాంత ప్రజలు హర్షిస్తున్నారని, సమర్థిస్తున్నారని ఇన్నాళ్లూ పాలక పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అదే ధీమాతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాన్ని ‘విశాఖలో పరిపాలనా రాజధాని’ నిర్ణయానికి రిఫరెండంగా భావిస్తామని కొంతమంది వైసీపీ నేతలు ప్రకటించారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) విజయం సాధించకపోతే విశాఖలో రాజధాని ఏర్పాటుకు అడ్డంకులు ఎదురవుతాయంటూ ప్రచారం చేశారు. ఎలాగైనా ఈ సీటును గెలుచుకొని విశాఖలో రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పుకుందాం అంటూ ఆరు జిల్లాల నాయకులను ఏకం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పార్టీ ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడే తిష్ట వేశారు. ఓటుకు వేయి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకూ వైసీపీ నేతలు పంచిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు ఉద్యోగులు కచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని భావించిన చోట వారి ఓట్లు లేకుండా గల్లంతు చేశారనే విమర్శలను అధికార పార్టీ నేతలు మూడకట్టుకున్నారు. అయినా వైసీపీకి నిరాశే ఎదురైంది.