YCP MLA: చంద్రబాబు కేసుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాట్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-09-14T12:46:43+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కేసు గురించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో 72వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై కేసు, అరెస్ట్ గురించి స్పందించారు.

YCP MLA: చంద్రబాబు కేసుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాట్ కామెంట్స్

ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) కేసు గురించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (YCP MLA Vasantha Krishna Prasad) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో 72వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై కేసు, అరెస్ట్ గురించి స్పందించారు. అంతకుముందు గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసులు పెట్టారని.. అప్పుడు జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganamohna Reddy) కేసు పెడితే సక్రమం...ఇప్పుడు చంద్రబాబుపై పెడితే అక్రమమా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లారని, ఆయన జైలు పక్షి అని టీడీపీ వాళ్ళు ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుడికి వెళ్ళారా? చంద్రబాబు కూడా జైలుకే వెళ్లారు... చంద్రబాబు జైలుపక్షి కాదా అని నిలదీశారు. చట్టబద్ధమైన సంస్థలు వారికి ఉన్న సమాచారం, సాక్ష్యాలను బట్టి చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు పెట్టారని.. తదనంతరం చట్టప్రకారం అరెస్ట్ చేశారని తెలిపారు. దేశంలో మాజీ ముఖ్య మంత్రులు జయలలిత, లాలూప్రసాద్ యాదవ్ లాంటి వారిపై కూడా దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయన్నారు. ఎవరికి వారు చట్టబద్ధంగా ఆయా కేసులను ఎదుర్కొన్నారని అన్నారు. ఏ కేసునైనా న్యాయపరంగా ఎదుర్కోవాలి కానీ దురుద్దేశంతో కేసు పెట్టారని అనడం సబబు కాదన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని తెలిపారు.


ఎమ్మెల్యే సూటి ప్రశ్న...

‘‘చంద్రబాబుపై అన్యాయంగా కేసు పెట్టారని గుంజుకుంటున్న వాళ్లకి సూటి ప్రశ్న. ఎర్రపుస్తకం (రెడ్ బుక్)లో పేర్లు రాస్తున్నానని, తాము అధికారంలోకి వస్తే అంతు తేలుస్తామని నారా లోకేశ్ (Nara lokesh) బెదిరించడం మన ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసమో అందరూ ఆలోచించాలి. నేను అధికారంలోకి వస్తే కేసులు పెడతాను అని ముందుగానే లోకేశ్ ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్?. చంద్రబాబు అరెస్టును సాకుగా చూపించి ఆందోళనలు, రాస్తారోకోలు చేసి ఉద్రిక్త వాతావరణం కలుగజేయడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం కరెక్ట్ పద్ధతి కాదు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టిస్తే చంద్రబాబుకు మేలు జరుగుతుందా? లేక బెయిల్ వస్తుందా?’’ అంటూ ప్రశ్నలు కురిపించారు. ఇటువంటి కుట్రపూరిత వ్యవహారాలు ప్రతిపక్షాలు మానుకోవాలని హితవుపలికారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని.. ప్రజలు ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-14T12:46:43+05:30 IST