Viveka Case: కాసేపట్లో సీబీఐ ఆఫీస్‌కు అవినాష్... భారీ పోలీస్ బందోబస్తు

ABN , First Publish Date - 2023-05-16T10:09:15+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి కాసేపట్లో సీబీఐ కార్యాలయానికి చేరుకోనున్నారు.

Viveka Case: కాసేపట్లో సీబీఐ ఆఫీస్‌కు అవినాష్... భారీ పోలీస్ బందోబస్తు

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి (Kadapa MP Avinash Reddy) కాసేపట్లో సీబీఐ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ (CBI) కార్యాలయం గేటు వద్ద పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బారికేడ్స్ వేసి కేవలం సీబీఐ కార్యాలయంలో విధులు నిర్వహించే వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బయట వ్యక్తులకు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి వాహనం తప్ప మరే వాహనానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. అయితే అవినాష్ రెడ్డి వెంట భారీగా అనుచరులు రానున్నారు. ఇప్పటికే అవినాష్ ఇంటికి అనుచరులు, కార్యకర్తలు చేరుకున్నారు. అయితే ఎవ్వరికీ లోపలికి అనుమతిలేదని పోలీసులు తెలిపారు.

మరోవైపు మరికొద్దిసేపట్లో అవినాష్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరనున్నారు. ఇప్పటికే సీబీఐ టీమ్ సీబీఐ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు అవినాష్‌ను సీబీఐ విచారణ చేయనుంది. విచారణ నిమిత్తం ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రమే సీబీఐ టీమ్ హైదరాబాద్‌కు చేరుకుంది. అవినాష్ రెడ్డి విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

వివేక హత్య కేసులో అవినాష్‌కు 160 సీఆర్పీసీ కింద సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయం ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో పలు దఫాలుగా విచారణ చేసి స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో అవినాష్ పిటిషన్ వేయగా... అందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కుట్రలో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేక హత్య కేసులో 20 రోజుల పాటు విరామం తర్వాత సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పులివెందుల, లింగాలలో జరగబోయే కార్యక్రమాలను అవినాష్ రెడ్డి రద్దు చేసుకున్నారు. నేడు అవినాష్ విచారణ తర్వాత సీబీఐ కీలక నిర్ణయం తీసుకుని అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-05-16T10:09:15+05:30 IST