Viveka Case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్‌రెడ్డి.. కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం
ABN , First Publish Date - 2023-06-10T10:18:57+05:30 IST
మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్/అమరావతి: మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) శనివారం ఉదయం సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎంపీని సీబీఐ విచారించనుంది. ముందస్తు బెయిల్ పొందిన తరువాత అవినాశ్ రెండో సారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఐదు మంది అధికారులు ఎంపీని విచారించనున్నారు. వివేకా హత్య జరిగిన రోజు మధ్యరాత్రి మాట్లాడిన వాట్సప్ కాల్స్‌పైనే సీబీఐ అధికారులు ప్రధానంగా ఆరా తీయనున్నారు. ఈరోజు విచారణలో ఆరు అంశాలపై ఎంపీ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ ఏ8 నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో అవినాశ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం 5 గంటలకు సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో వైసీపీ ఎంపీ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను నిన్న సీబీఐ కోర్టు (CBI Court) కొట్టివేసిన విషయం తెలిసిందే. మరోవైపు ముందుస్తు బెయిల్ కొట్టివేయాలంటూ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి (Sunitha Reddy) వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో (Supreme Court) వచ్చే మంగళవారం (జూన్ 13) విచారణ జరుగనుంది. సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడించనుంది?... సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది వేచి చూడాలి.