Coin vending machines: చిల్లర డబ్బులు అవసరమైనవారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్!.. ఇకపై..
ABN , First Publish Date - 2023-02-08T12:36:16+05:30 IST
ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోట్ల చలామణీయే ఎక్కువగా ఉన్నప్పటికీ నాణేలకు (Coins) కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దుకాణాల నిర్వాహకులకు చిల్లర డబ్బుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది...
ముంబై: ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోట్ల చలామణీయే ఎక్కువగా ఉన్నప్పటికీ నాణేలకు (Coins) కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దుకాణాల నిర్వాహకులకు చిల్లర డబ్బుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. త్వరలోనే క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారిత నాణేల విక్రయ యంత్రాలు (Coin vending machines) అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shakthikanth Das) వెల్లడించారు. తొలుత దేశంలోని 12 నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ యంత్రాల ద్వారా నాణేల లభ్యత, నాణేల వినియోగం మరింత సులభతరమవుతుందన్నారు.
కాగా నాణేల విక్రయ యంత్రాలు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. బ్యాంక్ నోట్లకు బదులు నాణేలను పంపిణీ చేస్తాయి. భౌతిక నోట్లతో అవసరం లేకుండా కస్టమర్ యూపీఐ (UPI) క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేసి నాణేలను పొందొచ్చు. కస్టమర్ ఖాతాలోని డబ్బు ఆటోమేటిక్‌గా కట్ అవుతుందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్ట్ ఆధారంగా బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసి.. మెషిన్ల ద్వారా నాణేల పంపిణీని ప్రమోట్ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
అసలేంటీ క్యూఆర్ కాయిన్ వెండిండ్ మెషిన్?
కొన్ని టాప్ బ్యాంకుల సహకారంతో క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషిన్‌ను (QCVM) అభివృద్ధి చేసినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ క్యూసీవీఎంలో క్యాష్ ఉండదు. కాయిన్లను మాత్రమే అందిస్తుంది. ఖాతాదారుడు యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా క్యూఆర్ కోడ్ స్కోన్ చేసి కాయిన్లు పొందొచ్చు. ఫలితంగా ఖాతాదారుడి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇందులో బ్యాంక్ నోట్ల అవసరం ఉండదు. కస్టమర్లు తమకు కావాల్సిన మొత్తంలో కాయిన్లను ఉపసంహరించుకోవచ్చు. ట్రయల్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని 19 లోకేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు వంటి జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌ను బట్టి వినియోగాన్ని క్రమంగా పెంచనున్నారు.